ఐపిఎల్ 2019 భారత అభిమానులకు పసందైన క్రికెట్ మజాను అందిస్తోంది. ఈ మ్యాచ్ లను ప్రత్యక్షంగా మైదానంలోనే వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులతో పాటు సెలబ్రిటీలు, మాజీ క్రికెటర్లు వస్తూ పొట్టి క్రికెట్ మజాను ఆస్వాదిస్తున్నారు. ఇక ఆటగాళ్ల కుటుంబ సభ్యులు మైదానంలో చేసే సందడి అంతా ఇంతా కాదు. కొందరు ఆటగాళ్ల సతీమణులతో పాటు పిల్లలను కూడా సహా వచ్చి పోడియంలో తమవాళ్లకు మద్దతుగా సందడి  చేస్తున్నారు. ఇలా బుధవారం హైదరాబాద్ లో సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కుటుంబం సందడి చేసింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై మొదట బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సన్ రైజర్స్ జట్టు పీల్డింగ్ కోసం మైదానంలోకి ప్రవేశించిన సమయంలో వార్నర్ కూతురు తండ్రికి మద్దతుగా తన పలకపై స్వహస్తాలతో ''గో డ్యాడీ''  అని  రాసి ప్రదర్శించింది. దీంతో మైదానంలోని కెమెరాలు ఆ పాపపైకి తిప్పడంతో బిగ్ స్క్రీన్ పై కనిపించింది. దీంతో తన కూతురు ప్లకార్డు చేతపట్టి తనకు మద్దతు తెలపడాన్ని చూసి వార్నర్ ఆనందంతో చిరునవ్వు నవ్వాడు. 

ఇక ఈ మ్యాచ్ లో చెన్నై నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో దంచికొట్టడంతో విజయం సునాయసంగా దక్కింది. హైదరాబాద్ బ్యాటింగ్‎లో వార్నర్ 50(25 బంతుల్లో 5 ఫోర్లు), బెయిర్ స్టోన్ 61(44 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లతో నాటౌట్) గా నిలిచి హైదరాబాద్ కు మరో మరుపురాని విజయాన్ని అందించారు.

ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులు రాజీవ్‌గాంధీ స్టేడియంల క్రిక్కిరిసిపోయింది. వీరితో పాటు హైదరబాదీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, టాలీవుడ్ హీరోలు సుమంత్, సుశాంత్‌ లు కూడా స్టేడియంలో సందడి చేశారు.