INDvsAUS: ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు టెస్టులలో ఇండియాతో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీనే చివరి టూర్ అని వార్తలు వెలువడుతున్న తరుణంలో అతడు కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఒకప్పుడు అటు పరిమిత ఓవర్ల క్రికెట్ తో పాటు ఇటు టెస్టు క్రికెట్ లోనూ జోరు కొనసాగించిన ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. మరీ ముఖ్యంగా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత టూర్ కు వచ్చిన వార్నర్‌కు ఇదే ఆఖరి టూర్ అని.. ఇక అతడు టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పాల్సిన టైమ్ వచ్చిందనీ వార్తలు వచ్చాయి. ఇదే నిజమా అన్నట్టుగా.. వార్నర్ ఈ సిరీస్ లో రెండు టెస్టులు ఆడి దారుణంగా విఫలమయ్యాడు.
నాగ్‌పూర్ టెస్టుతో పాటు ఢిల్లీలో కూడా ఫెయిలైన వార్నర్.. గాయం కారణంగా తిరిగి స్వదేశానికి పయనమయ్యాడు. కాగా సిడ్నీలో తనను కలిసిన విలేకరులతో వార్నర్ మాట్లాడుతూ.. తాను 2024 వరకూ టెస్టులలో ఆడతానని చెప్పడం గమనార్హం.
భారత టూర్ లో మూడు ఇన్నింగ్స్ లలో కలిపి వార్నర్ 27 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 15. కాగా సిడ్నీ విమానాశ్రయంలో వార్నర్ మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ ఒకే మాట చెబుతున్నాను. నేను 2024 వరకూ టెస్టులలో కొనసాగుతా. వచ్చే ఏడాది యాషెస్ లో ఆడతా. ఒకవేళ సెలక్టర్లు నేను ఆడలేను అనుకుంటే అది వాళ్ల ఇష్టం. అప్పుడు నేను పరిమిత ఓవర్ల క్రికెట్ కే పరిమితమవుతా...’అని చెప్పాడు.
కాగా 2024 యాషెస్ గురించి పక్కనబెడితే ఈ ఏడాది జూన్ నుంచి జరుగబోయే యాషెస్ సిరీస్ లో వార్నర్ ఆడేది అనుమానమే. 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా జూన్ 16 నుంచి జులై 31 వరకూ ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ ల మధ్య ఐదు టెస్టులు జరగాల్సి ఉంది. ఈ సిరీస్ కు వార్నర్ ఎంపికవడం కష్టమే అని ఇదివరకే ఆసీస్ సెలక్టర్లు హింట్ ఇచ్చారు. ‘ఫిట్ గా ఉండి బాగా ఆడే ఆటగాళ్లనే యాషెస్ కోసం ఎంపిక చేస్తాం..’అని ఆస్ట్రేలియా క్రికెట్ సెలక్టర్ టోని డోడ్‌మేడ్యూ ఇదివరకే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో గాయాలతో సావాసం చేస్తూ ఫామ్ కోల్పోయిన వార్నర్ ను యాషెస్ కు తీసుకుంటారా..? అన్నది అనుమానమే.
పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఫర్వాలేదనిపిస్తున్న వార్నర్.. టెస్టులలో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. గత 10 టెస్టులలో భాగంగా సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండో టెస్టులో డబుల్ సెంచరీని మినహాయిస్తే అతడి ఫామ్ ఆందోళనకరంగా ఉంది. గడిచిన పది ఇన్నింగ్స్ లలో వార్నర్ స్కోర్లు ఇవి.. 15, 10, 1, 10, 200, 0, 3, 21, 28, 5. గణాంకాలు దారుణంగా ఉండటంతో పాటు వయసు కూడా వార్నర్ పాలిట శాపంగా మారింది. కాగా భారత్ తో మిగిలిన రెండు టెస్టులకు గాయంతో వైదొలిగిన వార్నర్.. వన్డే సిరీస్ కు మాత్రం అందుబాటులో ఉండనున్నాడు.
