కరోనా వైరస్ దెబ్బకు పడకేసిన క్రీడారంగం ఇప్పుడిప్పుడే మేల్కొంటుంది. 117 రోజుల తరువాత విండీస్, ఇంగ్లాండ్ ల మధ్య పోరు విజయవంతమవడంతో... ఐపీఎల్ పై కూడా బోలెడన్ని ఆశలను పెట్టుకున్నారు అభిమానులు. అభిమానుల అంచనాలకు తగ్గట్టే ఐపీఎల్ కి ముహూర్తం ఖరారయింది. 

ఈ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) పేరు వింటేనే అభిమానులకు పూనకం వస్తుంది. ప్లేయర్‌ సిక్స్‌ కొట్టినా, వికెట్‌ తీసినా, క్యాచ్‌ పట్టినా.. అరుపులు, ఈలలతో మ్యాచ్‌ ఆసాంతం మైదానంలో ఒకటే సందడి చేస్తారు. 

కరోనా వైరస్‌ కారణంగా వాయిదాపడుతూ వస్తున్న ఈ టోర్నీ యూఏఈ వేదికగా వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటి నుండే ఫ్యాన్స్‌ సందడి మొదలైంది. తమ అభిమాన క్రికెటర్ల ఫోటోలను కట్‌ చేసి అద్భుతంగా ఎడిటింగ్‌ చేస్తున్నారు. 

ఈ క్రమంలో ఆస్ట్రేలియా డాషింగ్‌ ఓపెనర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అల వైకుంఠపురములో సినిమాలోని 'సితరాల సిరపడు' పాటలో టాలీవుడ్‌ హీరో, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఒక చేతిలో కోడి, మరో చేతిలో కత్తి పట్టుకుని విలన్‌ ఇంటికి వెళ్లే సీన్‌కు అరుపులు, విజిల్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. 

అంతలా అతడి స్టైల్‌ అభిమానులను అలరించింది. ఫాన్స్‌ ఇప్పుడు ఆ సీన్‌లోకి డేవిడ్‌ వార్నర్‌ను తీసుకొచ్చారు. అల్లు అర్జున్‌ కోడిపుంజుతో ఉన్న ఫొటోను ఓ అభిమాని మార్ఫింగ్‌ చేశాడు. ఇక్కడ వార్నర్‌ ఓ చేతిలో కోడిపుంజు, మరో చేతిలో బ్యాట్‌ పట్టుకొస్తున్నట్లు మార్ఫింగ్‌ చేశారు. అచ్చం వార్నరే ఆ సీన్‌ చేసినట్టు చేశాడు.