హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా) తన ఆరేళ్ల కూతురుతో కలిసి నగరంలో సరదాగా గడుపుతున్నాడు. మ్యాచ్ విరామ సమయాల్లో నగరంలో తన కూతురు ఇవీ మేతో కలిసి చక్కర్లు కొడుతున్నాడు.

2016లో హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహించిన డేవిడ్ వార్నర్.. అప్పుడు నాలుగేళ్ల వయస్సున్న తన కూతురుతో ఇలాగే టుక్ టుక్(ఆటో)లో సరదాగా నగరంలో తిరిగాడు. ఇప్పుడు మరోసారి తన కూతురుతో కలిసి అలాగే నగరాన్ని చుట్టేస్తున్నాడు.

 

ఢిల్లీతో ఆదివారం జరగనున్న నేపథ్యంలో వార్నర్ అప్పటి వరకు ఎంజాయ్ మూడ్‌లోనే ఉండనున్నాడు. కాగా, బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలతో డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా 12నెలలపాటు నిషేధం విధించింది. దీంతో ఓ ఏడాది(2018)పాటు వార్నర్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు.

ఆ తర్వాత మళ్లీ వార్నర్ హైదరాబాద్ జట్టుతో కలిశాడు. మంచి ఫాంలో ఉన్న వార్నర్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో 349 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఇప్పటి వరకు ఈ ఐపీఎల్‌లో ఒక సెంచరీతోపాటు మూడు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు వార్నర్.