'నేను మిమ్మల్ని అందరినీ సోదరుల్లా భావించాను. మీరు నన్ను కించపరిచే విధమైన పేరుతో పిలిచారు. ఆ పేరుతో పిలిచినప్పుడు డ్రెస్సింగ్‌రూమ్‌లో అందరూ నవ్వారు. నా శరీర రంగు అర్థం వచ్చేలా నన్ను పిలిచిన వారెవరో మీకు తెలుసు. నా నెంబర్‌ మీ దగ్గర ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌, ట్వీటర్‌లో మీరు ఉన్నారు. మీ అంతటగా వచ్చి, ఎందుకు అలా మాట్లాడారో చెప్పండి. క్షమాపణలు చెప్పండి. లేదంటే మీ పేర్లు నేనే చెబుతాను'.. వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌, స్టార్‌ క్రికెటర్‌ డారెన్‌ సామీ తాజా ప్రకటన ఇది. 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో వర్ణ వివక్ష కలకలం చల్లారలేదు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ మాజీ సహచరులు 'కాలూ' అని పిలువటం పట్ల కరీబియన్‌ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌, గ్లోబల్‌ టీ20 ప్లేయర్‌ డారెన్‌ సామీ ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. శరీర రంగు అర్థం స్ఫురించే పేరుతో, కించపరిచే పేరుతో పిలిస్తున్నప్పుడు డ్రెస్సింగ్‌రూమ్‌ అంతా పగలబడి నవ్వటం గుర్తొచ్చి ఎంతో వేదన చెందుతున్నానని సామీ ఆవేదన వ్యక్తపరిచాడు. వర్ణ వివక్ష చూపించిన మాజీ సహచరులు హుందా క్షమాపణలు తెలపాలని, లేదంటే వారి పేర్లను బహిర్గతం చేయాల్సి ఉంటుందని సామీ పేర్కొన్నాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో డారెన్‌ సామీ 2013, 2014 సీజన్లలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో చివరగా 2017లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ఆడాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడుతున్న సమయంలో డ్రెస్సింగ్‌రూమ్‌ సహచరులు డారెన్‌ సామీని 'కాలూ' అని పిలిచినట్టు ఇటీవల (జూన్‌ 7)న అతడు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో వెల్లడించిన సంగతి తెలిసిందే. సోదరుల్లా భావించిన క్రికెటర్లు తన పట్ల వర్ణ వివక్ష చూపిండాన్ని ఎంతో ఆలస్యంగా తెలసుకున్న డారెన్‌ సామీ ఎంతో వేదన పడుతున్నాడు. అలా పిలిచినందుకు, కించపరిచే విధంగా చూసినందుకు క్షమాపణలు చెప్పాలని తాజాగా డారెన్‌ సామీ పేర్కొన్నాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సామీ ఓ వీడియో పోస్ట్‌ చేశాడు.

'నేను పంచుకున్న డ్రెస్సింగ్‌రూమ్‌లలో నాకు గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. టీ20 ప్లేయర్‌గా, డ్రెస్సింగ్‌రూమ్‌ నాయకుడిగా ఎల్లప్పుడూ జట్టు బలోపేతానికే కృషి చేశాను. ఎన్నడూ జట్టు పడిపోయేలా చేయలేదు. నన్ను 'కాలూ' అని పిలిచినవారు ఎవరో మీకు బాగా తెలుసు. మీ దగ్గర నా మొబైల్‌ నెంబర్‌ ఉంది. నా ట్వీటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో ఉన్నారు. నాతో మాట్లాడండి. హసన్‌ మిన్హాజ్‌ పేర్కొన్నట్టు, మీరు ఆ ఉద్దేశంతో నన్ను సంబోధించారని ఎంతో బాధపడుతున్నాను. ఇప్పటికీ ఎంతో కోపంతో ఉన్నాను. మిమ్మల్ని అందరినీ సోదరులుగా భావించాను. నాకు క్షమాపణలు బాకీ పడ్డారు' అని డారెన్‌ సామీ వీడియోలో పేర్కొన్నాడు.