Asianet News TeluguAsianet News Telugu

అనుకూలంగా ఉంటూ బహుమతిలిస్తేనే జట్టులోకి.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు

Danish Kaneria Slams PCB: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వ్యవహరిస్తున్న తీరుపై మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా సంచలన ఆరోపణలు చేశాడు. సెలక్టర్లకు గిఫ్టులు ఇస్తే జట్టులో చోటు దక్కించుకోవచ్చునని వ్యాఖ్యానించాడు. 

Danish Kaneria Slams  PCB over team Selection, Says One Who Offers Gifts They get into Team
Author
India, First Published Jun 24, 2022, 12:05 PM IST

వచ్చే నెలలో రెండు టెస్టులు ఆడేందుకు గాను త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు రెండ్రోజుల క్రితం ప్రకటించింది. అయితే ఈ సెలక్షన్ తీరుపై ఆ జట్టు మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా పీసీబీపై సంచలన ఆరోపణలు చేశాడు. జట్టులోకి పలువురు ఆటగాళ్ల ఎంపిక,   కొంతమంది కీలక ఆటగాళ్లను పక్కనబెట్టడం పై ఆయన స్పందిస్తూ.. గిఫ్టులు ఇస్తే పాకిస్తాన్ జాతీయ జట్టులోకి ఆడొచ్చని, తమకు అనుకూలంగా ఉండేవారికి కూడా చోటు కల్పిస్తున్నారని వ్యాఖ్యానించాడు. 

18 మందితో కూడిన ఈ జట్టులో మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ తో పాటు వెటరన్  స్పిన్నర్ యాసిర్ షా కు కూడా చోటిచ్చారు సెలక్టర్లు. మరోవైపు  పాక్ ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ తో పాటు మరికొంతమంది ప్లేయర్లను పక్కనబెట్టడం.. పేసర్ హరిస్ రౌఫ్ ను తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ నేపథ్యంలో కనేరియా తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ... ‘లంక పర్యటనకు ప్రకటించిన జట్టును సెలక్టర్లు ఏ ప్రకారం ఎంపిక చేశారో నాకైతే అర్థం కావడం లేదు. దీనిని చూస్తుంటే సెలక్టర్లు ఇక ఎప్పటికీ తమ తీరు  మార్చుకోరని, ఆటగాళ్ల  ప్రదర్శన గురించి ఆలోచించరని అనిపిస్తున్నది. అసలు ఈ జట్టును రమీజ్ రాజా (పీసీబీ చీఫ్) ఎలా ఓకే చేశాడనేది పెద్ద ప్రశ్న.. ఆస్ట్రేలియాతో ఇటీవలే ముగిసిన టెస్టు సిరీస్ తర్వాత జట్టులో పలు మార్పులు అవసరమున్నాయనేది అందరూ అనుకుంటున్న మాటే. సాజిద్ ఖాన్ తో పాటు ఉస్మాన్ ఖాదిర్, జాహిద్ మహ్మద్ లను కారణం లేకుండా పక్కనబెట్టారు.. 

సర్ఫరాజ్ ను తిరిగి ఎంపిక చేశారు. మహ్మద్ రిజ్వాన్ వల్ల అతడికి అవకాశాలు రావడం లేదు. కానీ వయసు రీత్యా సర్ఫరాజ్ కు బదులు మరెవరైనా యువ వికెట్ కీపర్ కు అవకాశం ఇస్తే బాగుండేది కదా. హరీస్ రౌఫ్ ను టెస్టులకు తీసుకున్నారు. కానీ షాన్వాజ్ దహాని అతడి కంటే మంచి బౌలర్.. 

 

పాక్ సెలక్టర్లు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేయాలి. కానీ ప్రస్తుత సెలక్షన్ చూస్తే ఆ దిశగా ఆలోచించినట్టు కనిపించడం లేదు.  నాకు తెలిసి బాబర్ ఆజమ్, మహ్మద్ వసీం లు వాళ్లకు అనుకూలంగా ఉండేవారినే తీసుకుంటున్నారని అనిపిస్తున్నది.  అంతేగాక  సెలక్టర్లకు, పీసీబీలో ముఖ్యులకు బహుమతులు ఇచ్చినవారికి మాత్రమే జట్టులో చోటు దక్కుతుంది. ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు నిరాశే మిగులుతున్నది...’ అని దానిష్ వ్యాఖ్యానించాడు. 

శ్రీలంక పర్యటనకు పాక్ జట్టు : బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అజర్ అలీ, ఫహీమ్ అష్రఫ్, ఫావద్ ఆలం, హరీస్ రౌఫ్, హసన్ అలీ, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ నవాజ్, నసీం షా, నౌమన్ అలీ, సల్మాన్ అలి, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షాహిన్ అఫ్రిది, షాన్ మసూద్, యాసిర్ షా 
 

Follow Us:
Download App:
  • android
  • ios