బీసీసీఐ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సౌరవ్ గంగూలీ పదవీకాలం పొడిగించనున్నారా..? అవుననే సమాధానం వినపడుతుంది. సాధారణంగా ఆయన పదవీ కాలం 9నెలలు కాగా... దానిని మూడు సంవత్సరాలు చేయనున్నట్లు తెలుస్తోంది.

 గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా అక్టోబర్ 23వ తేదీన తన బాధ్యతలు చేపట్టారు. కాగా.. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే తన మార్క్ చూపించారు. టీమిండియా తొలిసారి డే అండ్ నైట్ టెస్టు మ్యాచులు ఆడేలా ఒప్పించడం, కోట్లాది రూపాయల ఖర్చుతో జరిగే ఐపీఎల్ వేడుకల్నిరద్దు చేయడం లాంటి నిర్ణయాలు గంగూలీ తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో... ఆయన పదవీ కాలం 9నెలల నుంచి 3 సంవత్సరాలకు మారిస్తే.. మరిన్ని మార్పులు  చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు. అందుకే ఆయన పదవీ కాలం పెంచాలని భావిస్తున్నారు. అయితే... లోథా సంస్కరణలతో ఏర్పడిన బీసీసీఐ కొత్త రాజ్యాంగం గంగూలీ మూడేళ్లపాటు కొనసాగేందుకు అనుమతించడం లేదు. బీసీసీఐలో ఎవరైనా రెండు సార్లు వరసగా( ఆరేళ్లు) రాష్ట్ర క్రికెట్ సంఘాలలో కానీ, బోర్డులో లేదా రెండింటిలోనూ ఆఫీసు బేరర్లుగా వ్యహరించి ఉంటే... ఆపై మూడు సంవత్సరాల విరామం తర్వాతే మళ్లీ పోటీ చేయాలి.

దీంతో గంగూలీ బెంగాల్ క్రికెట్ సంఘం చీఫ్ గా రెండు సార్లు బాధ్యతలు నిర్వర్తించడంతో అతను కేవలం తొమ్మిది నెలలు మాత్రమే బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంది.

అయితే... గంగూలీ కోసం ఏకంగా బీసీసీఐ రాజ్యాంగ సవరణలు చేయాలని పాలక వర్గం భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం 12పాయింట్లతో బోర్డు అజెండా రూపొందించినట్లు సమాచారం. అందులో ముఖ్యమైనది బోర్డు అధ్యక్ష, కార్యదర్శులు వచ్చే మూడేళ్లు పదవిలో కొనసాగేలా రాజ్యాంగాన్ని సవరించనున్నారు. దీనికి రాష్ట్ర అసోసియేషన్ లో మెజార్టీ సభ్యులు ఆమోదించాలి. ఒకవేళ ఆమోదం పొందింతే గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా మూడేళ్లు కొనసాగే అవకాశం ఉంది.