165 పరుగుల లక్ష్యఛేదనలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులకి పరిమితమైన భారత మహిళా జట్టు... ఫైనల్ చేరిన టీమిండియా... పతకం ఖాయం!
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్‌కి దూసుకెళ్లింది. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకున్న భారత మహిళా జట్టు... కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్‌కి అర్హత సాధించి మెడల్ ఖాయం చేసుకుంది...
165 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ మహిళా జట్టు, మొదటి ఓవర్ నుంచి భారత బౌలర్లపైకి ఎదురుదాడికి దిగింది. 2.4 ఓవర్లలోనే 28 పరుగులు రాబట్టారు ఇంగ్లాండ్ ఓపెనర్లు. 10 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేసిన సోఫియా డుంక్లేని దీప్తి శర్మ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసింది...
ఆ తర్వాత 8 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన అలీస్ కాప్సీ రనౌట్ అయ్యింది. 27 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు చేసిన డానియల్ వ్యాట్‌ని స్నేహ్ రాణా క్లీన్ బౌల్డ్ చేసింది. 81 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. అయితే అమీ జోన్స్, కెప్టెన్ నటలియా సివర్ కలిసి ఇంగ్లాండ్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు.
24 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేసిన అమీ జోన్స్ రనౌట్ కాగా 43 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 పరుగులు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ సివర్ కూడా రనౌట్ రూపంలోనే పెవిలియన్ చేరింది. ఒకానొక దశలో ఇంగ్లాండ్ విజయానికి 48 బంతుల్లో 68 పరుగులు కావాల్సి రావడం, చేతిలో 7 వికెట్లు ఉండడంతో ఈజీగా గెలుస్తారని అనిపించింది.
అయితే ఇంగ్లాండ్ బ్యాటర్‌ను భారీ షాట్లు ఆడకుండా నిలువరించిన భారత బౌలర్ దీప్తి శర్మ, మ్యాచ్‌ని 18 బంతుల్లో 30 పరుగులు కావాల్సిన స్థితికి తీసుకొచ్చింది. ఈ దశలో 18వ ఓవర్ వేసిన స్నేహ్ రాణా 3 పరుగులే ఇవ్వడం, ఆ తర్వాతి ఓవర్‌లో 13 పరుగులు వచ్చినా ఇంగ్లాండ్ కెప్టెన్ సివర్ రనౌట్ కావడంతో ఆఖరి ఓవర్‌లో ఇంగ్లాండ్ విజయానికి 14 పరుగులు కావాల్సి వచ్చాయి...
20వ ఓవర్ వేసిన స్నేహ్ రాణా మొదటి బంతికి పరుగులేమీ ఇవ్వలేదు. రెండో బంతికి సింగిల్ రాగా, మూడో బంతికి బ్రూంట్ డకౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ విజయానికి ఆఖరి 3 బంతుల్లో 13 పరుగులు కావాల్సి రాగా ఎక్లేస్టోన్ ఇచ్చిన క్యాచ్‌ని హర్లీన్ జారవిడిచింది. దీంతో ఇంగ్లాండ్‌కి ఓ పరుగు వచ్చింది. ఐదో బంతికి సింగిల్ రావడంతో భారత జట్టు విజయం ఖరారైపోయింది. ఆఖరి బంతికి సిక్సర్ బాదినా 4 పరుగుల తేడాతో విజయం అందుకున్న భారత మహిళా జట్టు ఫైనల్‌కి అర్హత సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగుల స్కోరు చేసింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన స్మృతి మంధాన, ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆటాడుకుంది. దీంతో పవర్ ప్లేలో భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది...
తొలి ఓవర్‌లో 6 పరుగులు రాగా, ఆ తర్వాత వరుసగా 11, 11, 12, 11, 13 పరుగులు రాబట్టిన స్మృతి మంధాన 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. భారత జట్టు తరుపున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా తన రికార్డును మరింత మెరుగుపర్చుకుంది స్మృతి మంధాన...
ఇంతకుముందు 2019లో న్యూజిలాండ్‌పై 24 బంతుల్లో, అంతకుముందు 2018లో ఇంగ్లాండ్‌పై 25 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన స్మృతి మంధాన, నేటి మ్యాచ్‌లో 23 బంతుల్లోనే ఆ మార్కును అందుకుంది. అంతేకాకుండా టీ20ల్లో పవర్ ప్లే లోపే అర్ధ శతకం పూర్తి చేసుకున్న మొట్టమొదటి భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది స్మృతి మంధాన...
ఓ ఎండ్‌లో స్మృతి మంధాన బౌండరీలు బాదుతుంటే, మరో ఎండ్‌లో షెఫాలీ వర్మకు ఎక్కువగా స్ట్రైయికింగ్ కూడా దక్కలేదు. షెఫాలీ వర్మ కూడా ఆరో ఓవర్‌లో రెండు ఫోర్లు బాది టచ్‌లోకి రావడంతో 7 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 73 పరుగులు చేసింది భారత జట్టు...
దీంతో భారత జట్టు ఈజీగా 190-200+ స్కోరు చేస్తుందని భావించారు టీమిండియా ఫ్యాన్స్. అయితే 17 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన షెఫాలీ వర్మను అవుట్ చేసిన ఫ్రెయా కెంప్, భారత జట్టు స్కోరుకి బ్రేకులు వేసింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే స్మృతి మంధాన కూడా అవుటైంది...
32 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసిన స్మృతి మంధాన, నటలై సివర్ బౌలింగ్‌లో వాంగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుటైంది. దీంతో 7వ ఓవర్ ముగిసిన తర్వాత రెండు ఓవర్లలో 4 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు...
20 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఫ్రెయా కెంప్ బౌలింగ్‌లో అవుట్ కాగా దీప్తి శర్మ 20 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసి ఆఖరి ఓవర్‌లో అవుటైంది. ఆ తర్వాతి బంతికే పూజా వస్త్రాకర్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌట్ అయ్యింది...
31 బంతుల్లో 7 ఫోర్లతో 44 పరుగులు చేసిన జెమీమా రోడ్రిగ్స్, ఆఖరి బంతికి ఫోర్ బాదింది. ఇంగ్లాండ్ బౌలర్లు ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాల రూపంలో కేవలం 2 పరుగులు ఇవ్వడం విశేషం.
