Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడలలో భాగంగా జరుగుతున్న మహిళల టీ20 మ్యాచులలో శుక్రవారం  బార్బోడస్ - పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ కు ఓటమి తప్పలేదు. 

కామన్వెల్త్ క్రీడలలో భారత్ మాదిరిగానే పాకిస్తాన్ కూడా ఓటమితో తమ ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ క్రీడలలో భాగంగా బార్బోడస్-పాకిస్తాన్ ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన గ్రూప్ మ్యాచ్ లో బార్బోడస్ జట్టు.. 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బార్బోడస్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. కైసియా నైట్ (62 నాటౌట్), హేల్ మాథ్యూస్ (51) రాణించారు. అనంతరం పాకిస్తాన్.. 129 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో నిదా దార్ (50 నాటౌట్) రాణించినా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. 

టాస్ గెలిచిన పాకిస్తాన్.. బార్బోడస్ కు ముందు బ్యాటింగ్ అప్పజెప్పింది. బార్బోడస్ ఓపెనర్ డాటిన్ (8) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా హేల్స్-నైట్ లు కలిసి రెండో వికెట్ కు 107 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. పాక్ బౌలర్లు వికెట్లు తీయకున్నా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి బార్బోడస్ ను తక్కువ స్కోరుకే నిలువరించారు. 

స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇరామ్ జావేద్ డకౌట్ అయింది. మునీబా అలీ (17), ఒమైమా సోహైల్ (10), కెప్టెన్ బిస్మా మరూఫ్ (12) లు కూడా అలా వచ్చి ఇలా వెళ్లారు. దీంత ఆ జట్టు 49 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 

కానీ నిదా దార్ (31 బంతుల్లో 50, 7 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది. అలియా రియాజ్ తో కలిసి ఆమె ఐదో వికెట్ కు 69 పరుగులు జోడించింది. అయితే చివరి రెండు ఓవర్లలో 30 పరరుగులు చేయాల్సి ఉండటంతో పాకిస్తాన్ తడబడింది. 19వ ఓవర్లో 4 పరుగులే రాగా.. చివరి ఓవర్లో 11 పరుగులొచ్చాయి. దీంతో బార్బోడస్.. 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Scroll to load tweet…

గ్రూప్-ఏ లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసీస్.. 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక భారత్-పాకిస్తాన్ లు ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. కామన్వెల్త్ లో ఇరు జట్ల భవితవ్యం ఈ మ్యాచ్ ద్వారా తేలనున్నది. ఈ పోటీలో నెగ్గిన జట్టు ముందంజ వేస్తుంది. 

Scroll to load tweet…