Asianet News TeluguAsianet News Telugu

CWG 2022: నిలబడి తడబడిన భారత్.. ఫైనల్లో ఓటమి.. కామన్వెల్త్ క్రికెట్ స్వర్ణం కంగారూలదే..

Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా 24 ఏండ్ల తర్వాత ప్రవేశపెట్టిన క్రికెట్ పోటీలలో స్వర్ణ పతకం ఆస్ట్రేలియాను వరించింది. చివరివరకు హోరాహోరిగా సాగిన పోరులో కంగారూలకే విజయం సొంతమైంది. లక్ష్య ఛేదనలో తడబడిన భారత జట్టుకు రజతం దక్కింది.  

CWG 2022:Australia Women Cricket Team Scripts History, Beat India by 9 Runs and clinch Gold
Author
India, First Published Aug 8, 2022, 12:50 AM IST

ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ పోరులో ఆస్ట్రేలియానే విజయం వరించింది. చివరిబంతి వరకు నువ్వా నేనా..? అంటూ సాగిన తుదిపోరులో భారత జట్టు పోరాడి ఓడింది. ఆట చివరివరకు ఆధిపత్యం చేతులు మారిన ఈ మ్యాచ్ లో  ఆసీస్ జట్టు 9 పరుగుల  తేడాతో గెలిచి  24 ఏండ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్ లో  ప్రవేశపెట్టిన క్రికెట్ పోటీలలో స్వర్ణం గెలుచుకుంది. లక్ష్య ఛేదనలో 15వ ఓవర్ వరకు  భారత్ ఆట చూస్తే ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోతుందనే అనుమానం ఎవరికీ రాలేదు. కానీ రెండు ఓవర్ల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో భారత జట్టు బ్యాటింగ్ పేకమేడలా కుప్పకూలింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (43 బంతుల్లో 65, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా కీలక సమయంలో ఔటై నిరాశపరిచింది.  ఈ విజయంతో ఆసీస్ కు స్వర్ణం, భారత్ కు రజతం దక్కాయి.

ఆసీస్ నిర్దేశించిన 162 పరుగులను ఛేదించే క్రమంలో భారత జట్టు.. వెంటవెంటనే ఓపెనర్లను కోల్పోయినా  జెమీమా రోడ్రిగ్స్ (33 బంతుల్లో 33, 3 ఫోర్లు) తో కలిసి హర్మన్‌ప్రీత్ కౌర్ (43 బంతుల్లో 65, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) టీమిండియాను నడిపించింది. 

లక్ష్య ఛేదనలో భారత్.. ఫామ్ లో ఉన్న ఓపెనర్లు స్మృతి మంధాన (6), షఫాలీ వర్మ (11) వికెట్లను  త్వరగా కోల్పోయింది.  ఆ క్రమంలో జెమీమాతో కలిసిన  హర్మన్‌ప్రీత్.. మూడో వికెట్ కు  98 పరుగులు జోడించింది. జెమీమా ఆచితూచి ఆడుతూ హర్మన్‌‌ప్రీత్ కు స్ట్రైకింగ్ ఇచ్చింది.  హర్మన్‌‌ప్రీత్ దాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించింది.  

జెమీమా  ఔట్.. భారత్ కు షాక్.. పతనం ప్రారంభం.. 

ఈ ఇద్దరి జోరు చూస్తే భారత్ విజయానికి దగ్గరవుతున్నట్టే  అనిపించింది. కానీ మేగన్ షట్ టీమిండియాకు షాకిచ్చింది. ఆమె వేసిన 15వ ఓవర్లో మూడో బంతికి జెమీమా బౌల్డ్ అయింది. ఆమె స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన పూజా వస్త్రకార్ (1) ను  ఆష్లే గార్డ్‌నర్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఔట్ చేసింది. అదే ఓవర్లో భారత్ కు డబుల్ షాక్ తగిలింది.   భారత జట్టును విజయం వైపునకు నడిపిస్తున్న  హర్మన్‌ప్రీత్ ను కూడా గార్డ్‌నర్.. ఐదో బంతికి  పెవిలియన్ కు పంపింది. దీంతో భారత్ విజయంపై అనుమానాలు నెలకొన్నాయి.   

ఆ క్రమంలో దీప్తి శర్మ (8 బంతుల్లో 13, 2 ఫోర్లు) పోరాడింది.  స్నేహ్ రాణా (8) తో కలిసి విజయం దిశగా సాగుతుండగా.. 18వ ఓవర్లో  రాణా రనౌట్ అయింది. ఆ తర్వాత వచ్చి రాధాయాదవ్ (1) కూడా రాణానే అనుసరించింది.  19వ ఓవర్లోనే దీప్తి కూడా మేగన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగింది. భారత్ గుండె పగిలింది. ఆ తర్వాత మేఘనా సింగ్ (1) కూడా రనౌట్ అవగా.. వికెట్ కీపర్ యస్తికా భాటియా (2) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. ఫలితంగా  ఆసీస్..  9 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్ మూడు వికెట్లు తీయగా.. మేగన్ 2 వికెట్లు పడగొట్టింది. 

 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ బెత్ మూనీ (61),  కెప్టెన్ మెగ్ లానింగ్ (36), ఆష్లే గార్డ్‌నర్ (26) రాణించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ ఠాకూర్, స్నేహ్ రాణాలు తలో రెండు వికెట్లు తీశారు.  

 

కామన్వెల్త్ క్రికెట్ లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మధ్య కాంస్య పోరు జరిగింది.  ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుని కాంస్యం నెగ్గింది. 

Follow Us:
Download App:
  • android
  • ios