230 పరుగుల లక్ష్యఛేదనలో 119 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్... నాలుగు వికెట్లు తీసి, బంగ్లా పతనాన్ని శాసించిన స్నేహ్ రాణా... మూడో విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి భారత జట్టు...
ఐసీసీ వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు బౌలర్లు అదరగొట్టాడు. బౌలింగ్‌కి చక్కగా సహకరిస్తున్న పిచ్‌పై బంగ్లాదేశ్‌ను 119 పరుగులకే ఆలౌట్ చేసేశారు. దీంతో 110 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న భారత మహిళా జట్టు, ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది....
230 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన బంగ్లాదేశ్ జట్టు, నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. మొదటి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులే చేసిన బంగ్లా, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ లక్ష్యంవైపు సాగుతున్నట్టు కనిపించలేదు...
షర్మీన్ అక్తర్ 5 పరుగులు చేసి రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో అవుట్ కాగా ఫర్గానా హక్ 11 బంతులాడి పూజా వస్త్రాకర్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యింది. నిగర్ సుల్తానా 11 బంతులాడి 3 పరుగులు చేసి స్నేహ్ రాణా బౌలింగ్‌లో అవుట్ కాగా 54 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన ఓపెనర్ ముర్సీద ఖటున్‌ను పూనమ్ యాదవ్ పెవిలియన్ చేర్చింది.
రుమానా అహ్మద్ 2 పరుగులు చేసి అవుట్ కావడంతో 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది బంగ్లాదేశ్. ఈ దశలో సల్మానా ఖటున్, లతా మొండల్ కలిసి ఆరో వికెట్‌కి 40 పరుగులు జోడించారు. సల్మానా ఖటున్ 35 బంతుల్లో 4 ఫోర్లతో 32 పరుగులు చేసి రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో అవుట్ కాగా 46 బంతుల్లో 2 ఫోర్లతో 24 పరుగులు చేసిన లతా మొండల్‌ను పూజా వస్త్రాకర్ పెవిలియన్ చేర్చింది...
ఫాతిమా ఖటున్, నహీదా అక్తర్‌లను అవుట్ చేసిన స్నేహ్ రాణా... 10 ఓవర్లలో 2 మెయిడిన్లతో 30 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. 104 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్... రితూ మోనీ 16, జహనరా ఆలం 11 పరుగులు చేయడంతో ఈ మాత్రం స్కోరు చేయగలిగింది.
ఈ విజయంలో టోర్నీలో మూడో విజయాన్ని అందుకున్న భారత జట్టు, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. దక్షిణాఫ్రికాతో మార్చి 27న జరిగే మ్యాచ్ ప్లేఆఫ్ బెర్తులను కన్ఫార్మ్ చేయనుంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ తొలి వికెట్‌కి 74 పరుగులు జోడించి శుభారంభం అందించారు. 51 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేసిన స్మృతి మంధాన, నహీదా అక్తర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యింది.
ఆ తర్వాతి ఓవర్‌లోనే 42 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసిన యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ, రితూ మోనీ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యింది. షెఫాలీ వర్మ అవుటైన తర్వాతి బంతికే కెప్టెన్ మిథాలీ రాజ్... గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరింది.
రితూ మోనీ బౌలింగ్‌లో షాట్‌కి ప్రయత్నించిన మిథాలీ రాజ్, ఫాతిమా ఖటున్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది. 2017 వన్డే వల్డ్ కప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన మిథాలీకి ఇదో రెండో గోల్డెన్ డక్. వన్డే వరల్డ్ కప్‌లో గోల్డెన్ డకౌట్ అయిన తొలి భారత కెప్టెన్‌గా, అత్యధిక సార్లు గోల్డెన్ డక్ అయిన కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటకట్టుకుంది మిథాలీ రాజ్...
74 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాకి హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్ రూపంలో మరో షాక్ తగిలింది. 33 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్, జట్టు స్కోరు 108 పరుగులున్నప్పుడు రనౌట్ అయ్యింది. ఈ దశలో రిచా ఘోష్, యస్తికా భాటియా కలిసి ఐదో వికెట్‌కి 54 పరుగుల భాగస్వామ్యం జోడించారు...
36 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసిన రిచా ఘోష్‌ను నహీదా అక్తర్ అవుట్ చేయగా 80 బంతుల్లో 2 ఫోర్లతో 50 పరుగులు చేసిన యస్తికా భాటియా... రితూ మోనీ బౌలింగ్‌లో అవుటైంది. పూజా వస్త్రాకర్ 33 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా స్నేహ్ రానా 23 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు చేసి అవుట్ అయ్యింది.
