స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డు సెంచరీలు... నాలుగో వికెట్‌కి 184 పరుగుల భారీ భాగస్వామ్యం... వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి 300+ స్కోరు చేసిన భారత జట్టు...
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవం తర్వాత భారత మహిళా జట్టు, అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. సీనియర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత సెంచరీలతో చెలరేగడంతో వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని పెట్టగలిగింది... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది.
ఓపెనర్లు యషికా భాటియా, స్మృతి మంధాన కలిసి భారత జట్టుకి శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత 21 బంతుల్లో 6 ఫోర్లతో 31 పరుగులు చేసిన యషికా భాటియా అవుట్ అయ్యింది...
కెప్టెన్ మిథాలీ రాజ్ 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి అవుటై, తన పేలవ ఫామ్‌ను కొనసాగించింది. దీప్తి శర్మ 21 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన దీప్తి శర్మ కూడా త్వరగా అవుట్ కావడంతో 78 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది భారత జట్టు...
ఈ స్థితిలో సీనియర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ కలిసి నాలుగో వికెట్‌కి 184 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. వుమెన్స్ వరల్డ్ కప్‌లో భారత జట్టుకి ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 2013 వన్డే వరల్డ్ కప్‌లో పూనమ్ రౌత్, తిరుష్ కమిని కలిసి జోడించిన 175 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించింది స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ జోడి...
119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 123 పరుగులు చేసిన స్మృతి మంధాన, వన్డే వరల్డ్ కప్‌లో రెండో సెంచరీ నమోదు చేయగా హర్మన్‌ప్రీత్ కౌర్ 107 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లో 109 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్‌కి ఇది వన్డే వరల్డ్ కప్ టోర్నీలో మూడో సెంచరీ.
టీమిండియా తరుపున వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన వుమెన్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసింది హర్మన్‌ప్రీత్ కౌర్. రిచా ఘోష్ 10 బంతుల్లో 5 పరుగులు చేసి రనౌట్ కాగా పూజా వస్త్రాకర్ 5 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి అవుట్ అయ్యింది...
జులన్ గోస్వామి 2, స్నేహ్ రాణా 2, మేఘనా సింగ్ 1 పరుగు చేయడంతో భారత జట్టు 317 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో భారత మహిళా జట్టు 300+ చేయడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం.
మొదటి రెండు మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసి, లక్ష్యాలను కాపాడుకుంటూ ఉత్కంఠ విజయాలు అందుకున్న వెస్టిండీస్ జట్టును భారత బౌలర్లు ఏ విధంగా కట్టడి చేస్తారనేదానిపైనే మ్యాచ్ రిజల్ట్ ఆధారపడి ఉంది. విండీస్ బౌలర్లలో అనిసా మహ్మమద్ రెండు వికెట్లు తీయగా షమిలా కన్నెల్, హేలీ మాథ్యస్, షకీరా సెల్మన్, డియాండ్రా డాటిన్, అలియా అలెన్ తలా ఓ వికెట్ తీశారు.
