261 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగి 198 పరుగులకి ఆలౌట్ అయిన భారత మహిళా జట్టు... 63 బంతుల్లో 71 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసిన వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్...
వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీని పాకిస్తాన్‌ను చిత్తు చేసి, ఘనంగా ఆరంభించిన భారత జట్టుకి రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది 261 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన భారత మహిళా జట్టు, 46.4 ఓవర్లలో 198 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 71 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా, ఆమెకు సరైన సహకారం లభించకపోవడంతో విజయ తీరాలకు చేర్చలేకపోయింది...
భారీ లక్ష్యఛేదనలో భారత మహిళా జట్టుకి శుభారంభం దక్కలేదు. ‘ఛేజ్ మాస్టర్’ స్మృతి మంధాన 21 బంతుల్లో 6 పరుగులు చేసి అవుట్ కాగా, దీప్తి శర్మ 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి పెవిలియన్ చేరింది...
ఓపెనర్‌గా వచ్చిన యషికా భాటియా 59 బంతుల్లో 2 ఫోర్లతో 28 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో 24 ఓవర్లు ముగిసే సరికే ఐదు మెయిడిన్లు వచ్చాయి. కెప్టెన్ మిథాలీ రాజ్ 56 బంతుల్లో ఓ ఫోర్‌తో 31 పరుగులు చేసి అవుట్ కాగా రిచా ఘోష్ డకౌట్ అయ్యింది. స్నేహ్ రాణా 28 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేయగా పూజా వస్త్రాకర్ 16 బంతుల్లో 6 పరుగులు చేసింది. జులన్ గోస్వామి 13 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేయగా మేఘనా సింగ్ 9 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది...
ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేసి 8వ వికెట్‌గా పెవిలియన్ చేరింది. కివీస్ బౌలర్లు లీ టహుహు, అమెలియా కేర్ మూడేసి వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగుల భారీ స్కోరు చేసింది... సూజీ బేట్స్ 5 పరుగులు చేసి రనౌట్ కాగా, కెప్టెన్ సోఫీ డివైన్ 30 బంతుల్లో 7 ఫోర్లతో 35 పరుగులు, అమిలియా కేర్ 64 బంతుల్లో 5 ఫోర్లతో 50 పరుగులు చేశారు. అమీ సథర్త్‌వైట్ 84 బంతుల్లో 9 ఫోర్లతో 75 పరుగులు చేయగా మ్యాడీ గ్రీన్ 36 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసింది...
51 బంతుల్లో 3 ఫోర్లతో 41 పరుగులు చేసిన వికెట్ కీపర్ కేటీ మార్టిన్‌ను జులన్ గోస్వామీ బౌల్డ్ చేయగా హేలీ జాన్సన్ 7 బంతుల్లో 1 పరుగు చేసి రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది.
ఒకానొక దశలో 42 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసిన న్యూజిలాండ్, భారత జట్టు ముందు భారీ లక్ష్యాన్ని పెట్టేలా కనిపించింది. అయితే భారత బౌలర్ పూజా వస్త్రాకర్ సంచలన స్పెల్‌తో కివీస్ బ్యాటర్లను కట్టడి చేసింది...
కెప్టెన్ సోఫీ డివైన్, 75 పరుగులు చేసి అమీ సథర్త్‌వైట్‌లను అవుట్ చేసిన పూజా వస్తాకర్, ఒకే ఓవర్‌లో వరుస బంతుల్లో లీ టహుహు, జెస్ కేర్‌లను అవుట్ చేసింది. ఫ్రాన్సెస్ మాకీ 13 పరుగులు, హన్నా రో 2 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 10 ఓవర్లలో 34 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా రాజేశ్వరి గైక్వాడ్ 10 ఓవర్లలో 4 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. జులన్ గోస్వామి 9 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 41 పరుగులిచ్చి ఓ వికెట్ తీసింది. దీప్తి శర్మకు ఓ వికెట్ దక్కింది.
