ICC Women's World Cup 2022: మహిళల ప్రపంచకప్ లో ఏడో సారి విశ్వ విజేతగా నిలవాలన్న ఆస్ట్రేలియా కల నెరవేరింది. క్రిస్ట్ చర్చ్ లో ముగిసిన ఫైనల్ లో ఆ జట్టు.. ఇంగ్లాండ్ ను 71 పరుగుల తేడాతో ఓడించింది. 

‘ఇది కదా మ్యాచ్ అంటే..’ మహిళల ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఈ మాట అనుకోని క్రికెట్ అభిమాని ఉండడంటే అతిశయెక్తి కాదేమో.. న్యూజిలాండ్ లోని క్రిస్ట్ చర్చ్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. ఆరు సార్లు ఛాంపియన్ ఆసీస్ మధ్య ముగిసిన ప్రపంచకప్ ఫైనల్ లో ఇరు జట్లు అసలైన క్రికెట్ మజాను పంచాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేయగా తర్వాత ఇంగ్లాండ్ కూడా 285 పరగులు సాధించింది. గెలుపోటముల సంగతి పక్కనబెడితే రెండు జట్లు కలిసి ఏకంగా 641 పరుగులు సాధించడం విశేషం. ఇంగ్లాండ్ ను 71 పరుగుల తేడాతో ఓడించిన ఆసీస్.. ఏడో ప్రపంచకప్ ను అందుకుంది. ఈ ట్రోఫీలో ఆసీస్ 9 మ్యాచులాడగా.. ఒక్క దాంట్లో కూడా ఓడకుండా కప్ ను గెలుచుకోవడం విశేషం. 

భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కు ఆదిలోనే షాక్ లు తగిలాయి. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఆ జట్టు స్టార్ బ్యాటర్ వ్యాట్ (4) ఔటయింది. బీమౌంట్ (27) తో పాటు కెప్టెన్ హెదర్ నైట్ (26) కూడా త్వరగానే నిష్క్రమించారు. దీంతో ఆ జట్టు 86 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. 

ఆ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన నటాలీ సీవర్ (121 బంతుల్లో 148 నాటౌట్.. 15 ఫోర్లు, 1 సిక్సర్) ఒంటరిపోరాటం చేసింది. మిగతా ఇంగ్లాండ్ బ్యాటర్లంతా ఆసీస్ బౌలింగ్ కు దాసోహమవుతుంటే.. సీవర్ మాత్రం వారిని ధీటుగా ఎదుర్కుంది. అయితే ఆమెకు సహకారం అందించేవారు లేకపోవడంతో ఇంగ్లాండ్ కు ఓటమి తప్పలేదు. 

Scroll to load tweet…

సీవర్ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన వారిలో అమీ జోన్స్ (20), సోఫి డన్క్లీ (22) , బ్రంట్ (1), సోఫీ ఎకెల్స్టోన్ (3) కేట్ క్రాస్ (2) దారుణంగా విఫలమయ్యారు. అయితే 9వ వికెట్ గా వచ్చిన చార్లెట్ డీన్ (21) కాసేపు ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కుంది. అయితే గార్డ్నర్ వేసిన 42.3 ఓవర్లో ఆమె.. జొనాసేన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ మరుసటి ఓవర్లోనే శ్రుబ్షోల్ ను ఔట్ చేసిన జొనాసేన్.. ఆసీస్ విజయాన్ని ఖాయం చేసింది. 

హేలీ షో.. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా కు ఆ జట్టు ఓపెనర్లు అలిస్సా హేలీ (170), హేన్స్ (68), మూనీ (62) లు రాణించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే ఇంగ్లాండ్ బౌలర్ల పనిపట్టిన హేలీ-హేన్స్ లు తొలి వికెట్ కు 160 పరుగులు జోడించింది. హేన్స్ నిష్క్రమించినా.. ఆమె స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన బెత్ మూనీ సాయంతో హేలీ చెలరేగిపోయింది. రెండో వికెట్ కు మూనీ-హేలీ లు 154 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే చివర్లో మరింత ధాటిగా ఆడే క్రమంలో హేలీ.. శ్రుభ్షోల్ బౌలింగ్ లో స్టంపౌట్ అయింది.

Scroll to load tweet…

ప్రపంచకప్ ఫైనల్ లో అత్యధిక స్కోరు.. 

ఇంగ్లాండ్ తో ముగిసిన ఫైనల్ మ్యాచులో అద్భుత సెంచరీలతో కదం తొక్కిన హేలీ.. అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా రికార్డు సృష్టించింది. వరల్డ్ కప్ ఫైనల్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఇప్పటివరకు ఆడం గిల్ క్రిస్ట్ (149 పరుగులు-శ్రీలంక పై 2007లో) పేరిట ఉన్న రికార్డును హేలీ బద్దలు కొట్టింది. ఈ జాబితాలో రికీ పాంటింగ్ (140 పరుగులు-2003 వరల్డ్ కప్ ఫైనల్.. ఇండియా పై ) కూడా ఉన్నాడు. అయితే వీళ్ల రికార్డులను హేలీ బద్దలు కొట్టింది. ఇదే మ్యాచులో ఇంగ్లాండ్ తరఫున సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన సీవర్ కూడా పాంటింగ్ రికార్డును అధిగమించింది. గిల్ క్రిస్ట్ కంటే ఒక పరుగు వెనుకబడింది.