ఐపీఎల్ 2020లో మరో మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. ఆఖరి ఓవర్ దాకా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్  హైదరాబాద్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. 163 పరుగుల లక్ష్యసాధనతో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్... నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 157 పరుగులకి పరిమితమైంది. షేన్ వాట్సన్ 1 పరుగు, అంబటి రాయుడు 8, డుప్లిసిస్ 22, కేదార్ జాదవ్ 3 పరుగులు చేసి అవుటైనా... రవీంద్ర జడేజాతో కలిసి అద్భుతంగా పోరాడాడు మహేంద్ర సింగ్ ధోనీ...

5 వికెట్‌కి 72 పరుగులు జోడించిన జడేజా... కెరీర్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేసుకుని అవుట్ అయ్యాడు జడేజా. మహేంద్ర సింగ్ ధోనీ 36 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సామ్ కుర్రాన్ 15 పరుగులు చేసినా... ఆఖరి ఓవర్‌లో 28 పరుగులు కావాల్సిన దశలో కేవలం 20 పరుగులు రాబట్టగలిగారు ధోనీ, కుర్రాన్. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇది చెన్నై సూపర్ కింగ్స్‌కి వరుసగా మూడో ఓటమి కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.