ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తన జోరు కొనసాగిస్తోంది. అన్ని జట్లపై వరస విజయాలు సాధిస్తూ.. విజయ పరంపర కొనసాగిస్తోంది. ఈ విజయాలతో టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది. బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్ పై చాలా సునాయాసంగా చెన్నై విజయం సాధించడం విశేషం. ఈ మ్యాచ్ విజయం తర్వాత ధోనీ మీడియాతో మాట్లాడాడు.

తమ జట్టు విజయం సాధించడం పట్ల ధోనీ ఆనందం వ్యక్తం చేశాడు. తమ జట్టు బ్యాటింగ్ చాలా బాగుందని.. అలా అని బౌలింగ్ బాలేదని కాదని చెప్పాడు. రెండు విభాగాల్లోనూ తమ జట్టు ఆకట్టుకుంటోందని ధోనీ ధీమా వ్యక్తం చేశాడు. అయితే.. ఢిల్లీ వికెట్ మాత్రం తనకు షాక్ గా అనిపించిందని.. అలా ఎలా అయ్యిందో అర్థం కాలేదని.. అలా అవుతుందని తాను ఊహించలేదని ధోనీపేర్కొన్నాడు.

‘తమకు 170 స్కోర్ చేయడం పెద్దగా కష్టమనిపించలేదు. ఇది గత సీజన్‌ నుంచి వచ్చిన మార్పే. బాగా ఆడితే తుది జట్టు కూర్పుపై ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.. ఆడకపోతే సమస్యగానే ఉంటుంది. మేము సుమారు 5-6 నెలల నుంచి క్రికెట్‌కు దూరంగానే ఉన్నాం. ఇది చాలా కష్టంగా అనిపిస్తోంది. సొంతంగా ప్రాక్టీస్‌ అనేది కూడా చేయలేం. సుదీర్ఘ కాలంగా క్వారంటైన్‌లో ఉండటం అలానే మరికొన్ని విషయాలు ప్రాక్టీస్‌ను దూరం చేశాయి.

మా ఆటగాళ్లంతా ఈ సీజన్‌లో మరింత బాధ్యతను తీసుకున్నారు. గత 8-10 సంవత్సరాల నుంచి మా జట్టులో భారీ మార్పులు లేవు. దాంతో ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయాలు వారికే అర్థమవుతాయి. చాలా మంది ఆటగాళ్లకు తుది జట్టులో ఆడేందుకు ఎక్కువ అవకాశం రావడం లేదు. వారిని అభినందించక తప్పదు. డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావారణం ఆరోగ్యకరంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. అది అంత ఈజీ కాదు. నువ్వు టాప్‌ లెవల్‌లో ఉన్నప్పుడు ఆడటానికి స్వేచ్ఛ దొరకుతుంది’ అని తెలిపాడు.