Asianet News TeluguAsianet News Telugu

అంపైర్‌ను బెదిరించిన ధోని? సోషల్‌ మీడియాలో వైరల్‌(వీడియో)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌ మ్యాచ్‌లో మహీ ప్రవర్తన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

CSK VS SRH: MS DHoni Pressurised To Change His Decision?SRH
Author
Hyderabad, First Published Oct 14, 2020, 2:08 PM IST

మిస్టర్‌ కూల్‌ సహనం కోల్పోయాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మరోసారి అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 2019 ఐపీఎల్‌లో నో బాల్‌ విషయంలో డగౌట్‌ నుంచి లేచి.. మైదానంలోకి అడుగుపెట్టి మరీ అంపైర్లతో వాగ్వాదానికి దిగిన ఎం.ఎస్‌ ధోని.. ఈసారి వికెట్ల వెనకాల నుంచే అంపైర్‌ను కను సైగతో శాసించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌ మ్యాచ్‌లో మహీ ప్రవర్తన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అసలు ఏం జరిగింది?:

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌. 168 పరుగుల ఛేదనలో ఆఖర్లో హైదరాబాద్‌ అప్పుడే గేర్‌ మార్చింది. కరన్‌ శర్మ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో హైదరాబాద్‌ 18 పరుగులు పిండుకుంది. దీంతో సమీకరణం 12 బంతుల్లో 27 పరుగులకు మారింది.  

రషీద్‌ ఖాన్‌ ధనాధన్‌ మూడ్‌లో ఉండటంతో ఒత్తిడి చెన్నై సూపర్‌కింగ్స్‌పై స్పష్టంగా కనిపించింది.  రషీద్‌ ఖాన్‌ను అడ్డుకునేందుకు, తర్వాతి ఓవర్లో షార్దుల్‌ ఠాకూర్‌ ఆఫ్‌ స్టంప్‌కు ఆవలగా బంతులు వేశాడు.  తొలి బంతికి రెండు పరుగులు రాగా.. రెండో బంతి లైన్‌ను దాటడంతో అంపైర్‌ పాల్‌ రొనాల్డ్‌ రీఫెల్‌ వైడ్‌గా ప్రకటించాడు.  

షార్దుల్‌ ఠాకూర్‌ తర్వాతి బంతిని సైతం ఆఫ్‌ స్టంప్‌కు ఆవలగా విసిరాడు. రషీద్‌ ఖాన్‌ ముందుకొచ్చి ప్రయత్నించినా.. బంతి బ్యాట్‌కు అందలేదు. నేరుగా వికెట్‌ కీపర్‌ ధోని చేతుల్లోకి వెళ్లిపోయింది. బంతి లైన్‌ మీదుగా వెళ్లడంతో అంపైర్‌ పాల్‌ రొనాల్డ్‌ రీఫెల్‌ మళ్లీ వైడ్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు చేతులు సగం పైకెత్తాడు. 

ఇంతలోనే బౌలర్‌ షార్దుల్‌ ఠాకూర్‌తో పాటు కెప్టెన్‌ ఎం.ఎస్‌ ధోని అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు.  ధోని కనుసైగతో కదిలిపోయిన అంపైర్‌ పాల్‌ రీఫెల్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. 

అంపైర్‌ వైడ్‌ బాల్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటంతో,  డగౌట్‌లో రిలాక్స్‌గా కూర్చోన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డెవిడ్‌ వార్నర్‌ సైతం సహనం కోల్పోయాడు.  వార్నర్‌, ధోనిలను అసహనాన్ని టీవీ రిప్లేలో పదేపదే చూపించారు.

మరి రియాక్షన్‌ ఎలా ఉంది?

మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే మిస్టర్‌ కూల్‌ ఎం.ఎస్‌ ధోని.. జాతీయ జట్టు తరఫున ఎన్నడూ సహనాన్ని కోల్పోయిన సందర్భాలు లేవు. నిరుడు ఐపీఎల్‌లో నో బాల్‌ నిర్ణయంపై అంపైర్లతో వాదనకు దిగేందుకు ధోని ఏకంగా నిబంధనలకు విరుద్ధంగా డగౌట్‌ నుంచి మైదానంలోకి వచ్చాడు. 

అయినా, మ్యాచ్‌ రిఫరీ మహిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. అప్టట్లో ధోని ప్రవర్తనపై అతడి మాజీ సహచరుడు వీరేందర్‌ సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ' ధోని తన జట్టు కోసం ఇలా నిబంధనలను అతిక్రమించి, మైదానంలో అంపైర్లతో వాదనకు దిగటం నాకు నచ్చింది. కానీ ఆ పని భారత జట్టు కోసం చేస్తే బాగా సంతోషించే వాడిని. చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ఆడేటప్పుడు ధోని ఎందుకు భావోద్వేగాలకు లోనవుతాడో తెలియదు' అని వీరూ ట్వీట్‌ చేయటం తెలిసిందే.

ఇప్పుడూ అటువంటి స్పందనలే వినిపిస్తున్నాయి. దిగ్గజం ధోని అంపైర్‌ను ప్రభావితం చేయటం ఏమిటీ? ఈ ఏడాది ఫెయిర్‌ ప్లే అవార్డు ధోని జట్టుకే ఇవ్వాలని సోషల్‌ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇక ఆ బంతి నిజంగానే వైడ్‌ బాల్‌ కాదని.. అందులో ధోని తప్పేం లేదని, అంపైర్‌ పొరపాటు చేయబోయాడని సూపర్‌కింగ్స్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో మహి చర్యను సమర్థిస్తున్నారు.

ఇప్పటికే పేలవ అంపైరింగ్‌ నిర్ణయాలతో ఐపీఎల్‌ స్థాయిని అంపైర్లు బాగా దిగజార్చిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఆరంభంలో పంజాబ్‌, ఢిల్లీ మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో అంపైర్‌ నితిన్‌ మీనన్‌.. ఆఖర్లో పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ఓ పరుగును షార్ట్‌ రన్‌గా ప్రకటించాడు. 

దీంతో ఆ మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అంపైర్‌కే ఇవ్వాలని సెహ్వాగ్‌ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. మైదానంలో అంపైర్‌ నిర్ణయాన్ని ప్రభావితం చేసిన మహి మరోసారి కోరుకోని విధంగా వార్తల్లో నిలిచాడు.

Follow Us:
Download App:
  • android
  • ios