మహేంద్ర సింగ్ ధోనీ... భారత క్రికెట్‌లో ఓ సంచలనం. మరో 50 ఏళ్ల తర్వాత కూడా భారత క్రికెట్ గురించి చెప్పాల్సి వస్తే ‘ధోనీకి ముందు- ధోనీకి తర్వాత’ అని విడదీసి చెబుతారేమో. క్రికెట్‌లో అంతలా రికార్డులు క్రియేట్ చేసిన మహేంద్రసింగ్... స్టైల్ విషయంలో కూడా ఓ ట్రెండ్ సెట్టర్. కెరీర్ ఆరంభంలో పొడవైన జుంపాల జుట్టుతో ఉండే ధోనీని చూసి... యూత్ మొత్తం అతన్నే ఫాలో అయిపోయారు. ధోనీ ప్రభావం వల్ల హీరోలు కూడా జుంపాల జుట్టుతో కనబడాల్సి వచ్చింది.

జుంపాల జుట్టును కట్ చేసిన తర్వాత క్లీన్ షేవ్‌తో ఓ సారి, సైడ్ కట్ కట్టింగ్‌తో, తెల్లని గడ్డంతో... ఇలా చాలామందికి ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచాడు ‘తలైవా’. అయితే కొన్నాళ్ల కిందట ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్న ధోనీ వీడియోను చూసి అందరూ షాక్ అయ్యారు. తెల్ల జుట్టు, తెల్ల గడ్డంతో ధోనీ వృద్ధుడిలా తయారయ్యాడని కామెంట్లు వినిపించాయి.

అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే ధోనీ స్టైల్ మార్చేశాడు. మొదటి మ్యాచ్‌లో ఏకంగా ఫ్రెంచ్ కట్‌తో కనిపించి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు ధోనీ. పూర్తిగా ఫ్రెంచ్ కట్‌లా కాకుండా తనదైన స్టైల్‌లో జుట్టుకీ, గడ్డానికి మధ్య కొద్దిగా గ్యాప్ మాత్రమే ఉంచాడు ధోనీ. మరి ఫ్యాషన్ ప్రపంచంలో ధోనీ ఈ న్యూలుక్ ఎంతటి సంచలనం రేపుతుందో చూడాలి.