Virender Sehwag Slams BCCI: గురువారం రాత్రి వాంఖెడే లో ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పవర్ కట్ వల్ల కొద్దిసేపు డీఆర్ఎస్ పనిచేయలేదు. తాజాగా ఇదే విషయమై వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య గురువారం వాంఖెడే వేదికగా జరిగిన మ్యాచ్ లో డీఆర్ఎస్ పనిచేయకపోవడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని, చెన్నైని ఓడించడానికి ముంబై ఇండియన్స్ ఓనర్ ముఖేశ్ అంబానీ యే ఇలా చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయమై భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించాడు. అయితే అతడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ని ఉద్దేశించి సెటైర్లు వేశాడు. పవర్ కట్ వల్ల టాస్ ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ లో ఫ్లడ్ లైట్లు పని చేసినప్పుడు డీఆర్ఎస్ ఎందుకు పనిచేయలేదని ప్రశ్నించాడు.
ముంబై-సీఎస్కే మ్యాచ్ అనంతరం వీరూ మాట్లాడుతూ.. ‘పవర్ కట్ వల్ల డీఆర్ఎస్ లేకపోవడం అనేది ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని వేల కోట్ల ఖర్చు చేస్తున్న ఐపీఎల్ లో కరెంట్ పోయినప్పుడు జనరేటర్లు ఉపయోగించడంలో తప్పులేదు... జనరేటర్ ను స్టేడియంలో లైట్ల కోసమే వాడుతున్నారా..?
దానితో ఐపీఎల్ ప్రసారకర్తలు ఉపయోగించే సిస్టమ్స్ (డీఆర్ఎస్) కోసం కాదా..? వాళ్లదగ్గర ఏ రకమైన సాఫ్ట్వేర్ ఉన్నా అది జనరేటర్ కు పని చేస్తుంది కదా. మరింకేంటి..? జనరేటర్ తో స్టేడియంలో ఫ్లడ్ లైట్లు, ఇతర సామాగ్రి అంతా పనిచేసినప్పుడు డీఆర్ఎస్ కూడా పనిచేసి ఉండాల్సింది కదా.. ఒకవేళ డీఆర్ఎస్ ను వాడకుంటే మ్యాచ్ మొత్తానికి వాడకుండా ఉండాలి. కానీ కొద్దిసేపు పవర్ లేదని, మళ్లీ దానిని పునరుద్దరించి వాడటం వల్ల చెన్నై కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒకవేళ ముంబై తొలుత బ్యాటింగ్ చేసినా వాళ్లకూ ఇలాగే జరిగుండేది..’ అని వీరూ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్ లో డీఆర్ఎస్ లేకపోవడం వల్ల తొలి ఓవర్లో డెవాన్ కాన్వే వికెట్ కోల్పోయిన చెన్నై అదే ఓవర్లో మోయిన్ అలీ వికెట్ కూడా నష్టపోయింది. ఆ తర్వాత ఓవర్లో రాబిన్ ఊతప్ప కూడా ఔటయ్యాడు. ఊతప్ప ఔట్ అయిన సమయంలో డీఆర్ఎస్ పునరుద్దరించినా అతడు దానిని తీసుకోకుండానే వెనుదిరిగాడు. అయితే ముంబై మ్యాచ్ గెలవడం కోసం ముఖేశ్ అంబానీయే తన పలుకుబడిని ఉపయోగించి పవర్ కట్ చేయించాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
