వయసులో పెద్దవాళ్లు, గొప్పవాళ్లు అనుకున్నవాళ్లు కనిపిస్తే... కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం భారతీయ సంప్రదాయం. సచిన్ టెండూల్కర్ ఆశీర్వాదం తీసుకోవడం కోసం యువరాజ్ సింగ్‌తో పాటు చాలామంది క్రికెటర్లు, అభిమానులు ఆయన కాళ్లపై పడేవారు.

తాజాగా ఐపీఎల్ 2021 సీజన్‌లో కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నాడు భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. గత సీజన్ వరకూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న హర్భజన్ సింగ్, 2021 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడుతున్న విషయం తెలిసిందే.

కేకేఆర్, సీఎస్‌కే మధ్య జరిగిన మ్యాచ్‌లో భజ్జీతో తన పాత టీమ్‌ మేట్స్ ఇమ్రాన్ తాహీర్, డుప్లిసిస్ వంటి ప్లేయర్లు కలిసి మాట్లాడడం కనిపించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు భజ్జీ, ఇమ్రాన్ తాహీర్‌తో మాట్లాడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన సురేశ్ రైనా, వెంటనే అతని కాళ్లకు మొక్కాడు.

 

ఈ సంఘటనతో షాకైన హర్భజన్ సింగ్, వద్దని వారిస్తూ రైనాతో పాటు కింద కూర్చున్నాడు. ఆ తర్వాత లేచి, రైనాను గుండెలకు హత్తుకున్నాడు. ఈ ఇద్దరు భారత క్రికెటర్ల మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలిచిందీ సంఘటన...

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 18 పరుగుల తేడాతో విజయం అందుకున్న విషయం తెలిసిందే. 221 పరుగుల భారీ లక్ష్యచేధనలో 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కోల్‌కత్తా... ఆండ్రే రస్సెల్, దినేశ్ కార్తీక్, ప్యాట్ కమ్మిన్స్ వీరోచిత పోరాటం వల్ల 202 పరుగులకు ఆలౌట్ అయ్యింది.