Asianet News TeluguAsianet News Telugu

CSK vs DC Highlights : చెన్నైకి తొలి ఓట‌మి.. చివ‌ర‌లో ధోని మెరుపులు.. ఢిల్లీ ఆల్ రౌండ్ షో..

DC vs CSK : ఐపీఎల్ 2024 13వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓడిపోయినా ఎంఎస్ ధోనీ త‌న‌ హిట్టింగ్ బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టాడు. చివరి ఓవర్లలో వచ్చి బౌండ‌రీల మోత మోగించాడు.
 

CSK vs DC Highlights : Chennai's first defeat in IPL 2024, Dhoni's brilliance at the end. Delhi all-round show RMA
Author
First Published Apr 1, 2024, 1:11 AM IST

Chennai Super Kings vs Delhi Capitals : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజ‌న్ 13వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ త‌ల‌ప‌డ్డాయి. వైజాగ్ లోని డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ చెన్నై సూప‌ర్ కింగ్స్ ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ 20 ప‌రుగుల తేడాతో చిత్తుచేసింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ లో పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్, మిచెల్ మార్ష్ రాణించారు. ఇక బౌలింగ్ లో ముఖేష్ కుమార్ 3 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీసుకున్నారు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది. 20 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తుచేసింది.

వైజాగ్ లో ధోనీ బ్యాటింగ్ కు వచ్చినప్పుడు స్టేడియం ఒక్క‌సారిగా హోరెత్తింది. ఐపీఎల్ 2024లో ధోని తన మొదటి బంతిని కొట్టాడు, అభిమానులు క్రేజీ అయ్యారు. స్టేడియం మొత్తం ధోనీ-ధోనీ నినాదాలతో హోరెత్తింది. ఆ తర్వాత ధోనీ తన తుఫాను బ్యాటింగ్ ను మ‌రోసారి చూపించాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 పరుగుల తేడాతో ఓడిపోయినా, ఈ 16 బంతుల్లో ధోనీ 37 పరుగులు చేయడం  అందరినీ సంతోషపెట్టింది. ధోనీ త‌న ఇన్నింగ్స్ లో 3 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ విజయం.. 

ఐపీఎల్ 2024 13వ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ధోని తన బ్యాటింగ్ తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై జట్టు 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సీజన్లో చెన్నైకి ఇదే తొలి ఓటమి కాగా, ఢిల్లీ జట్టుకు ఇది తొలి విజ‌యం.

చెన్నైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ‌..

192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఓపెన‌ర్ల నుంచి శుభారంభం ల‌భించ‌లేదు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (1 పరుగు), రచిన్ రవీంద్ర (2 పరుగులు) త్వ‌ర‌గానే పెవిలియన్ చేరారు. మూడో వికెట్ కు అజింక్యా రహానె, డారిల్ మిచెల్ ల మధ్య మంచి భాగస్వామ్యం ఉన్నప్పటికీ అక్షర్ పటేల్ 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మిచెల్ ను ఔట్ చేసి చెన్నైకి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత రహానే కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 45 పరుగులు చేసిన తర్వాత ముఖేష్ కుమార్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత శివం దూబే, సమీర్ రిజ్వీల వికెట్లు పడటంతో చెన్నై ఇన్నింగ్స్ కు బ్రేక్ పడింది. చివరలో జడేజా (21 నాటౌట్)తో కలిసి ధోనీ (37 నాటౌట్) భారీ షాట్లు వేసి అభిమానులను అలరించినా జట్టును విజయతీరాలకు చేర్చడంలో సఫలం కాలేదు.

రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ..

ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ 32 బంతులు ఎదుర్కొని 51 పరుగులు చేశాడు. త‌న ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్ లో పంత్ 23 బంతుల్లో తొలి 23 పరుగులు చేయ‌గా, ఆ తర్వాత దూకుడుగా పెంచి తర్వాతి 9 బంతుల్లో 28 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఘోర కారు ప్రమాదం త‌ర్వాత క్రికెట్ గ్రౌండ్ లోకి దిగిన త‌ర్వాత పంత్ నుంచి వ‌చ్చిన తొలి హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ ఇది. అభిమానులు కూడా పంత్ పెద్ద ఇన్నింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ 50 పరుగులు పూర్తి చేసుకోగానే స్టేడియంలో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు లేచి నిలబడి అతడికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చాడు. అభిమానులే కాదు, డగౌట్లో కూర్చున్న తోటి ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కూడా నిలబడి అతని ఇన్నింగ్స్ ను అభినందించారు.

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ మెరుపులు

విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్, డేవిడ్ వార్న‌ర్ సూప‌ర్బ్ ఇన్నింగ్స్ ల‌తో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ తొలి వికెట్ కు 93 పరుగులు జోడించి శుభారంభం అందించారు. వార్నర్ 52 పరుగులు చేసి ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.  తర్వాత పృథ్వీ షా రూపంలో ఆ జట్టుకు రెండో ఎదురుదెబ్బ తగిలింది. 43 పరుగులు చేసి షా ఔట్ అయ్యాడు. పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 51 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 18 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ భారీ పరుగులు చేయడంలో విజ‌య‌వంతం కాలేదు.

అదే స్టైల్.. అవే సిక్సర్లు.. చెన్నై గెలవక పోయినా ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ తో చెన్నై ఫ్యాన్స్ ఖుషీ !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios