ఐపీఎల్ 2020 నుంచి సురేశ్ రైనా వైదొలగటం వెనుక వస్తున్న వార్తలు నిజమే అయితే, ఎల్లో జెర్సీలో సురేశ్ రైనాను ఇక చూడలేని మాట వాస్తవం.
ఐపీఎల్ తొలి సీజన్ ఆరంభానికి ముందు ఆటగాళ్ల వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ సురేశ్ రైనాను ఎంచుకుంది. పదేండ్లు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన రైనా, ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 164 మ్యాచుల్లో 4527 పరుగులు. ఐపీఎల్‌లో 5368 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానం. ఐపీఎల్‌లో ఎల్లో జెర్సీ కనపడగానే మహేంద్రసింగ్ ధోని తరువాత గుర్తొచ్చే తొలి పేరు అతడిదే.
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగించటంలోనూ మహిని అనుసరించిన ఆ స్టార్ క్రికెటర్.. బయో సెక్యూర్ బబుల్ ఐపీఎల్‌లో భిన్నమైన దారిని ఎంచుకున్నాడు. కుటుంబ కారణాల రీత్యా సురేశ్ రైనా ఐపీఎల్ 2020కి దూరమైనట్టు చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్ననాథ్ ట్విట్టర్‌లో స్పష్టం చేసినా.. దుబాయి నుంచి భారత్‌కు రావటం వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. ఐపీఎల్ 2020 నుంచి సురేశ్ రైనా వైదొలగటం వెనుక వస్తున్న వార్తలు నిజమే అయితే, ఎల్లో జెర్సీలో సురేశ్ రైనాను ఇక చూడలేని మాట వాస్తవం.
బాల్కనీ రచ్చ...
చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంఛైజీ ప్రోటోకాల్ ప్రకారం జట్టు కెప్టెన్, కోచ్, మేనేజర్‌లకు హౌటల్‌లో సూట్ రూమ్‌లు కేటాయిస్తారు. అయినా, సురేశ్ రైనా కోసం సూపర్ కింగ్స్ ఎక్కడ బస చేసినా సూట్ రూమ్ బుక్ చేసేవారు. బయో సెక్యూర్ బబుల్ ఐపీఎల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ దుబాయి శివార్లలోని ఓ ఐదు నక్షత్రాల హౌటల్‌లో బస చేస్తోంది. ఇక్కడ ఎం.ఎస్ ధోని, స్టిఫెన్ ఫ్లెమింగ్‌తో పాటు రైనాకు సూట్ రూమ్ కేటాయించారు.
కానీ రైనాకు కేటాయించిన రూమ్‌కు బాల్కనీ సౌకర్యం లేదని సమాచారం. బాల్కనీ లేకపోవటం చిన్న సమస్యే, దాన్ని వేరే విధంగా పరిష్కరించుకునే వెసులుబాటు ఉంది. అయినా, సురేశ్ రైనా ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటూ స్వదేశానికి తిరిగి రావటం విస్మయానికి గురి చేసింది.
బయో సెక్యూర్ బబుల్ ప్రోటోకాల్‌లో భాగంగా హౌటల్‌లో సురేశ్ రైనా ప్రవర్తన ఆమోదయోగ్యంగా లేదని ప్రాంఛైజీ వర్గాల సమాచారం. ధోనితో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన రైనా.. ఇలా ఇంత చిన్న కారణంతో ఐపీఎల్‌కు దూరమయ్యాడు అంటే నమ్మశక్యంగా లేదు.
శ్రీనివాసన్ దిద్దుబాటు వ్యాఖ్యలు....
సురేశ్ రైనా ఐపీఎల్ 2020కి దూరం కావటంపై చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ ఘాటుగా స్పందించాడు. ' సురేశ్ రైనా దూరం కావటం సూపర్‌కింగ్స్‌పై ఎటువంటి ప్రభావం చూపదు. యువ బ్యాట్స్‌మన్ రుత్‌రాజ్ గైక్వాడ్‌కు అవకాశం లభించనుంది. ఎవరికి తెలుసు, గైక్వాడ్ ఈ సీజన్‌లో గొప్పగా రాణిస్తాడేమో. క్రికెటర్లు వ్యక్తిగత స్వార్థం గురించే ఆలోచన చేస్తారు. కొన్నిసార్లు విజయం తలకెక్కుతుంది. తను ఏం కోల్పోయాడనేది రైనాకు నెమ్మదిగా తెలుస్తుంది.'
'రైనా నిష్క్రమణపై ఎం.ఎస్ ధోనితో మాట్లాడాను. సూపర్‌కింగ్స్‌కు ధోని రూపంలో బలమైన కెప్టెన్ ఉన్నాడు. ఇలాంటి విషయాలకు చలించే వ్యక్తి కాదు ధోని. జట్టులోని అందరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారని ధోని చెప్పాడు' అని శ్రీనివాసన్ ఓ పత్రికతో తెలిపాడు.
శ్రీనివాసన్ ఈ వ్యాఖ్యలు చేయటంతో మీడియాలో పెద్ద దుమారమే రేగింది. సురేశ్ రైనాను ఉద్దేశించి శ్రీనివాసన్ ఘాటుగా మాట్లాడటంతో సురేశ్ రైనా ప్రాంఛైజీ యజమానికి కోపం తెప్పించే పని ఏం చేసుంటాడనే చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలతో రైనా పట్ల వ్యతిరేక భావం ఏర్పడటంతో శ్రీనివాసన్ దిద్దుబాటు చర్యలు చేపట్టాడు.
'రైనా నిష్క్రమణపై నా వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారు. పదేండ్లుగా సూపర్ కింగ్స్ కుటుంబంలా ఉంటోంది. సూపర్‌కింగ్స్‌కు రైనా చేసిన సేవ మరువలేనిది. క్రికెటర్లు ప్రైమా డొన్నాస్.. అనడాన్ని వ్యతిరేక భావంతో తీసుకున్నారు. సంగీత కచేరిలో ప్రధాన గాయకులను ఆ విధంగా సంభోదిస్తారు. క్రికెట్‌లో క్రికెటర్లదే ఎల్లప్పుడూ కీలక భూమిక. ఇటువంటి క్లిష్ట సమయంలో సూపర్‌కింగ్స్ రైనాకు మద్దతుగా ఉంటుంది' అని శ్రీనివాసన్ వివరణ ఇచ్చాడు.
ప్రైమా డొన్నాస్‌కు వాస్తవిక అర్థం ప్రధాన గాయకులే అయినా.. వాడుకలో తల పొగరు వ్యక్తులను ఉద్దేశించి వినియోగిస్తున్నారు. సురేశ్ రైనా ఐపీఎల్ కెరీర్‌లో 193 మ్యాచుల్లో 5368 పరుగులు, 25 వికెట్లు, ఓ శతకం, 38 అర్థ సెంచరీలు సాధించాడు.
