టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ సురేశ్ రైనా ఐపీఎల్ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందనే దానిపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాతో  పాటు క్రీడా ప్రపంచంలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

దీనికి తెర దించుతూ రైనా అసలు విషయం బయటపెడుతూ ట్వీట్లు చేశాడు. పంజాబ్‌లో తమ కుటుంబంలో చోటు చేసుకున్న దుర్ఘటనపై స్పందించాడు. అక్కడ జరిగింది దారుణం కంటే ఘోరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

మా మావయ్య హత్యకు గురయ్యారని.. మేనత్త, వాళ్ల ఇద్దరు కుమారులు తీవ్ర గాయాలపాలయ్యారు. దురదృష్టం కొద్దీ గత రాత్రి ఒక సోదరుడు కన్నుమూశాడు. ఇప్పటికీ అత్తయ్య పరిస్ధితి విషమంగానే ఉంది.

ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తొలి ట్వీట్ చేశాడు. మరో ట్వీట్‌లో ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే దానిపై మాకెవరికీ ఎలాంటి సమాచారం లేదని.. ఎవరు, ఎందుకు ఇలా చేశారో తెలియదు.

ఈ ఘటనపై పంజాబ్ పోలీసులు త్వరగా దర్యాప్తు చేయాలని కోరుతున్నా, ఇంత ఘోరంగా మమ్మల్ని బాధపెట్టిన వాళ్లెవరో తెలియాల్సిన కనీస అవసరం మాకుందన్నారు. ఆ నేరస్థులు మరిన్ని ఘోరాలు చేయకముందే పట్టుకోవాలన్నారు.

ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ట్యాగ్ చేశారు. మరోవైపు రైనా త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ 13వ సీజన్ ఆడటం లేదని, అతడు దుబాయ్ నుంచి తిరిగి భారత్‌కు పయనమయ్యాడని మూడు రోజుల క్రితం ఆ జట్టు ప్రకటించింది. అయితే, అతడెందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడనేది మాత్రం బయటకు చెప్పలేదు.