చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ త్వరలో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరనున్నారు. గత కొంతకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చేరి టెస్టులు చేయించుకున్నారని సమాచారం. 

ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గత సోమవారం అహ్మాదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను మట్టి కరిపించి చెన్నై ఐదో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ధోనీ నాయకత్వ పటిమ, ఆటగాళ్ల సమిష్టి కృషితో చెన్నై విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌లో ధోనీ మరోసారి పాల్గొంటారా లేక ఇదే ఆయన చివరి ఇండియన్ ప్రీమియర్ లీగా అనే దానిపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కోట్లాది మంది అభిమానులు మాత్రం ధోనీని వచ్చే ఏడాది కూడా గ్రౌండ్‌లో చూడాలని కోరుకుంటున్నారు. 

ఇదిలావుండగా.. వయస్సు, మోకాలి గాయంతో బాధపడుతున్నా ధోనీ జట్టును అద్భుతంగా నడిపించారు. నొప్పిని పంటిబిగువున భరిస్తూనే బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించారు. ఫైనల్‌లో చెన్నై గెలిచిన తర్వాత ఆయన గ్రౌండ్ మొత్తం కలియతిరిగారు. ఈ సమయంలో తన ప్యాంట్ పైకి లేపి.. మోకాలికి ఓ క్యాప్ ధరించి కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ALso Read: ఐపీఎల్‌ తర్వాత రాజకీయాల్లోకి మహేంద్ర సింగ్ ధోనీ! పర్ఫెక్ట్ ఫ్యూచర్ లీడర్‌ అవుతాడంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్...

ఎట్టకేలకు చెన్నైని గెలిపించి తన లక్ష్యాన్ని చేరిన ధోనీ కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారట. అంతేకాదు త్వరలోనే ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరి తన మోకాలి గాయానికి చికిత్స తీసుకుంటారని టాక్. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని టెస్ట్ రిపోర్టులను బట్టి సర్జరీపై నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. దీంతో ధోనీ త్వరగా మోకాలి గాయం నుంచి కోలుకుని తిరిగి గ్రౌండ్‌లో కనిపించాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు.