మహేంద్ర సింగ్  ధోని... టీమిండియానే కాదు ఐపిఎల్ చెన్నై జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను  అందించి విజయవంతమైన కెప్టెన్ గా పేరుతెచ్చుకున్నాడు. కెప్టెన్, బ్యాట్ మెన్ గానే కాకుండా వికెట్ కీఫర్ గా కూడా అతడికి అద్భుతమైన రికార్డుంది. వికెట్ల వెనకాల కీపర్ గా చురుగ్గా కదులుతూనే ప్రత్యర్థి బ్యాట్ మెన్స్ వీక్ నెస్ కనిపెట్టి వారిని కట్టడి చేయడంకోసం  బౌలర్లకు సలహాలిస్తుంటాడు. ఎలా బౌలింగ్ చేస్తే ఏ  బ్యాట్ మెన్ బోల్తా పడతాడో బౌలర్లకంటే ఎక్కువగా ధోనీకే తెలుసని అనడంలో అతిశయోక్తి లేదు.

అయితే మంగళవారం జరిగిన మ్యాచ్ లో ధోని ప్రత్యర్థి బ్యాట్ మెన్ ను కట్టడిచేయడానికి ఇచ్చిన సలహా విని తాను ఆశ్యర్యపోయినట్లు బౌలర్ దీపక్ చాహర్ తెలపాడు. ఇలా దీపక్ మాటలతో ధోని మైదానంలో ఎంత చతురతతో ఆలోచిస్తాడో మరోసారి బయటపడింది. 

ఐపిఎల్ 2019 లీగ్ మ్యాచుల్లో భాగంగా సొంత మైదానంలో చెన్నై కోల్‌కతా జట్టుతో తలపడింది. ఇందులో మొదట బ్యాటింగ్ కు దిగిన పర్యటక జట్టు పరుగులు సాధించడానికి చాలా కష్టపడుతున్న సమయంలో ధోనీ తనకు బంతిని అందించాడని చాహర్ తెలిపాడు. అయితే అప్పటికే కోల్ కతా జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయినా ఇంకా విధ్వంసకర బ్యాట్ మెన్  రస్సెల్స్ క్రీజులోనే వున్నాడు. దీంతో అతడిని కట్టడి చేయడానికి ధోని తనకు ఓ సలహా ఇచ్చాడని చాహర్ వెల్లడించాడు. 

సిక్సులు, ఫోర్లు ఇచ్చినా పరవాలేదు గాని సింగిల్‌ తీసే అవకాశం ఇవ్వొద్దని ధోని చెప్పాడట. అలా ముఖ్యంగా నాన్ స్ట్రైకర్ ఎండ్ రస్సెల్స్ వున్న సమయంలో చేయాలని...ఇలా అతడు తక్కువ బంతులనే ఆడేలా చేయాలన్నది ధోని వ్యూహమన్నారు. ఇలా ధోని ప్రణాళిక చెన్నై  విజయానికి ఎంతో దోహదపగడిందని మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్‌ దీపక్‌ చహర్ తెలిపాడు. 

కోల్ కతా‌పై చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ అద్భుత విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాను నిర్ణీత 20 ఓవర్లలో 108 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమయ్యింది. ఆ లక్ష్యాన్ని చెన్నై కేవలం 17.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి చేధించి ఘన విజయం సాధించింది.