ఐపిఎల్ సీజన్ 12లో లీగ్ దశను దాటడానికి అన్ని జట్లు ఆపసోపాలు పడుతుంటే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం మరో మూడు మ్యాచులు మిగిలుండగానే ప్లేఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇలా 11 మ్యాచుల్లో 8 విజయాలను సాధించిన చెన్నై 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సీజన్ ఆరంభంనుండి వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో చెన్నైకి వరుసగా రెండు పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో కాస్త ఢీలా పడ్డ జట్టు మంగళవారం సన్ రైజర్స్ హైదరాబాద్ పై సాధించిన విజయం ద్వారా మళ్ళీ రెట్టించిన ఉత్సాహాన్ని పొందింది. 

సొంత మైదానంలో జరిగిన  మ్యాచ్ లో షేన్ వాట్సన్ (96 పరుగులు) చెలరేగడంతో చెన్నై మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఘనవిజయంతో సీజన్ 12 లో ప్లేఆఫ్‌కు చేరుకున్న మొదటి జట్టుగా చెన్నై నిలిచింది. చెపాక్ స్టేడియంలో మ్యాచ్ ముగిసిన అనంతరం వ్యాఖ్యాత హర్షబోగ్లే ధోనితో మాట్లాడుతూ... ప్రతి ఐపిఎల్ లో చెన్నై జట్టు అద్భుతంగా రాణిస్తూ ప్లేఆఫ్ కు చేరుకోడంలో రహస్యమేంటని ప్రశ్నించాడు. దీనికి  ధోని కాస్త చమత్కారాన్ని జోడిస్తూ ఫన్నీగా సమాధానం చెప్పాడు. 

ఇది తమ జట్టుతో మాత్రమే షేర్ చేసుకునే రహస్యమని తెలిపాడు. దీన్ని బయటపెడితే వచ్చే ఏడాది ప్రతి జట్టు అదే పార్ములాను పాలో అవుతూ తమను దెబ్బతీసే ప్రమాదముందని పేర్కొన్నాడు. దీంతో చెన్నై యాజమాన్యం నన్ను జట్టులోంచి తప్పించవచ్చని...కాబట్టి ఆ రహస్యాన్ని భయటపెట్టలేని  ధోని వెల్లడించాడు. కానీ రిటైర్మెంట్ తర్వాత తప్పకుండా చెప్తానని ధోని ఫన్నీగా సమాధానం చెప్పాడు. 

 ఆ తర్వాత ధోని మళ్లీ మాట్లాడుతూ... జట్టు విజయ రహస్యమంటూ ఏమీ లేదని, ఆటగాళ్లందరు సమిష్టిగా విజయం కోసం పట్టుదలగా ఆడటమే విజయ రహస్యంగా భావించవచ్చని అన్నాడు. అభిమానుల మద్దతు, యాజమాన్యం ఇచ్చిన ప్రోత్సాహం కూడా తమ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నాడు. ఇక జట్టు సహాయక బృందం తమ కోసం ఎంతో శ్రమిస్తుందరని...వారికి కూడా చెన్నై విజయంలో భాగముందని ధోని పేర్కొన్నాడు.