IPL 2024 : ధోని 'థల' అయితే జడేజా 'దళపతి' ... ఎవరికి ఏ బిరుదు సరిపోయింది?
స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కలిగిన కోల్ కతా నైట్ రైడర్స్ రవీంద్ర జడేజా బౌలింగ్ లో చిత్తయ్యింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు... మొత్తంగా మూడు వికెట్లు తీసి కోల్ కతా నడ్డివిరిచి అరుదైన బిరుదును పొందాడు.
చెన్నై : తమిళనాడు ప్రజలు ఎవరినైనా ఇష్టపడితే వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఇలా ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూ తమిళ ప్రజలకు చాలా దగ్గరయ్యాడు మహేంద్ర సింగ్ ధోని. ఎంతలా అంటే ధోని కాస్త 'థల' (నాయకుడు)గా మారిపోయాడు... అతడు కేవలం చెన్నై జట్టుకే కాదు తమకు కూడా నాయకుడని తమిళ ప్రజలు భావిస్తుంటారు. ఇక ఇదే సిఎస్కే టీంలో చాలాకాలం కొనసాగిన సురేష్ రైనాను 'చిన్న థల' గా పిలుచుకునేవారు. ఇప్పుడు తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న రవీంద్ర జడేజాకు 'దళపతి' గా మారిపోయాడు.
నిన్న(సోమవారం) చెన్నై సూపర్ కింగ్స్ టీం కోల్ కతా నైట్ రైడర్స్ పై అద్భుత విజయం సాధించింది. హోం గ్రౌండ్ చెపాక్ లో పసుపు టీం పండగ చేసుకుంది... ప్రత్యర్థిపై అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే సిఎస్కే విజయంలో రవీంద్ర జడేజాది కీలక పాత్ర... గింగిరాలు తిప్పుతూ బంతులతో మామాజాలం చేసాడు. జడేజా బౌలింగ్ లో ఆడలేక కెకెఆర్ తోక ముడిచింది. కేవలం బౌలింగ్ తోనే కాదు చక్కటి ఫీల్డింగ్ తో కోల్ కతా టీంను ఉక్కిరిబిక్కిరి చేసాడు. విధ్వంసకర బ్యాటర్లు సునీల్ నరైన్, రఘువంశి, వెంకటేష్ అయ్యర్ లను తన స్పిన్ మాయాజాలంతో బురిడీ కొట్టించడమే కాదు ఫిలిప్ సాల్ట్, శ్రేయాస్ అయ్యర్, మిచెల్ స్టార్క్ లను కళ్ళుచెదిరే క్యాచ్ లు పట్టి ఔట్ చేసాడు జడేజా. ఇలా బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన కెకెఆర్ ను కేవలం 137 పరుగులకే కట్టడి చేసి చెన్నై విజయానికి బాటలు వేసాడు జడ్డూ.
ఇలా అద్భుత ప్రదర్శనతో చెన్నైని గెలిపించి మరోసారి తమిళుల మనసు దోచుకున్నాడు జడేజా. దీంతో ధోని మాదిరిగానే జడేజాకు కూడా తమ తమిళ్ స్టైల్లో ఓ బిరుదు ఇచ్చారు. ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ గా నిలిచిన జడేజాను బహుమతుల ప్రధానోత్సవ సమయంలో కామెంటేటర్ హర్షా బోగ్లే 'క్రికెట్ దళపతి' అంటూ సంబోధించాడు. అయితే తన బిరుదుకు ఫ్యాన్స్ ఆమోదం లభించాల్సి వుందని జడేజా కూడా సరదాగా రియాక్ట్ అయ్యాడు. కానీ దీన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మాత్రం సీరియస్ గా తీసుకున్నట్లుంది... జడేజాను 'క్రికెట్ దళపతి'గా దృవీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఎక్స్ వేదికన ట్వీట్ చేసింది.
అయితే జడేజాకు ఇచ్చిన క్రికెట్ దళపతి బిరుదుపై ఫ్యాన్స్ నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ఇప్పటికే జడేజాను 'సర్' అని ముద్దుగా పిలుస్తుంటారు ఫ్యాన్స్... ఇప్పుడు అతడిని 'క్రికెట్ దళపతి'గా మార్చింది సీఎస్కే యాజమాన్యం. దీంతో జడేజా 'సర్''క్రికెట్ దళపతి' బిరుదుల మధ్య పోటీ నెలకొంది. ఎక్స్ వేదికన తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు నెటిజన్స్... మరి జడేజాకు ఏ పేరు సరిపోతుందని నిర్ణయిస్తారో చూడాలి.