IPL 2022: ఈ ఐపీఎల్ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ కు అచ్చిరానట్టుంది. సీజన్ కు ముందు కెప్టెన్ అవడం.. తిరిగి దాని నుంచి నిష్క్రమించడం.. గత రెండు మ్యాచులకు దూరంగా ఉండటం.. ఇక ఇప్పుడు అతడు మొత్తంగా సీజన్ నుంచే తప్పుకోనున్నాడని సీఎస్కే వర్గాల టాక్.
ఐపీఎల్-2022 లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పై నమ్మకముంచి దానిని పూర్తిగా కోల్పోయిన సీఎస్కే యాజమాన్యం.. అతడిని కెప్టెన్ గానే గాక మొత్తం సీజన్ నుంచి కూడా తప్పించడానికి రంగం సిద్ధమైందా..? అంటే అవుననే అంటున్నాయి చెన్నై వర్గాలు. గాయం కారణం చూపి జడ్డూను మొత్తం సీజన్ నుంచే తప్పించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఆర్సీబీతో మ్యాచ్ లో జడేజా గాయపడ్డాడు. దాంతో తర్వాత రెండు మ్యాచులకు అతడిని దూరంగా పెట్టింది సీఎస్కే. ఇక ఇప్పుడు.. రాబోయే 3 మ్యాచులకు కూడా అతడు ఆడేది అనుమానమే.
సీఎస్కే వర్గాల ప్రకారం.. గాయం కారణంగా 2022 సీజన్ నుంచి రవీంద్ర జడేజా తప్పుకోనున్నాడు. ఆర్సీబీ తో మ్యాచ్ సందర్బంగా గాయపడ్డ జడ్డూ.. ముంబైతో ఈనెల 12 న జరిగే మ్యాచ్ తో పాటు తర్వాత జరుగబోయే గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచులకు దూరం కానున్నాడని తెలుస్తున్నది.
ఈ సీజన్ లో జడ్డూ 10 మ్యాచులాడి బ్యాటింగ్ లో 116 పరుగులే చేయగా.. ఐదు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. దీంతో పాటు కెప్టెన్ గా కూడా మెప్పించలేకపోయాడు. ఈ కారణంతోనే జడ్డూ కు సారథ్య బాధ్యతల నుంచి ఉద్వాసన పలికింది సీఎస్కే. తిరిగి వాటిని ధోనికే అప్పగించింది. అయితే కెప్టెన్సీ విషయంలో జడ్డూకు సీఎస్కే యాజమాన్యానికి మధ్య గొడవలు తలెత్తినట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతోనే జడ్డూను ఆర్సీబీతో మ్యాచ్ తర్వాత రెండు మ్యాచులకు పక్కనబెట్టారని, ధోని చెప్పినా సీఎస్కే యాజమాన్యం వినలేదని కూడా తెలుస్తున్నది. ఇక రవీంద్ర జడేజా కూడా ఇన్స్టా లో సీఎస్కే అధికారిక ఖాతాను అన్ ఫాలో చేయడం కూడా ఈ అనుమానాలకు తావిస్తున్నది.
ఇక ఇదే గాయం కారణాన్ని జడ్డూను సీజన్ మొత్తం మీద ప్రయోగించాలని సీఎస్కే భావిస్తున్నది. ఒకవేళ ఇవే వార్తలు నిజమైతే మాత్రం జడ్డూ కథ కూడా మరో డేవిడ్ వార్నర్-ఎస్ఆర్హెచ్ మాదిరే కానుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మరిన్ని విషయాలు తెలియాలంటే శుక్రవారం ముంబైతో మ్యాచ్ లో జడ్డూ ఆడకుంటే పూర్తి స్పష్టత రానున్నది.
