Asianet News TeluguAsianet News Telugu

గాయాలయ్యేది జిమ్‌లో.. గ్రౌండ్‌లో కాదు.. క్రికెటర్లు బరువులెత్తడమేంటి..? వీరూ సంచలన వ్యాఖ్యలు

Virender Sehwag: తరుచూ గాయాల పాలవుతున్న టీమిండియా క్రికెటర్లను ఉద్దేశిస్తూ నజఫ్‌గఢ్ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు  గ్రౌండ్ లో కంటే జిమ్ లలో ఎక్కువ గాయాలపాలవుతున్నారని వీరూ తెలిపాడు. 

Cricketers Injuring in Gym, not in The Ground: Virender Sehwag Comments on Indian Players Injuries MSV
Author
First Published Mar 17, 2023, 11:15 AM IST

జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్, శ్రేయాస్ అయ్యర్..  టీమిండియా ప్లేయర్ల  గాయాల జాబితా నానాటికీ పెరుగుతూనే ఉంది. అసలే ఈ ఏడాది అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో  గాయాలు భారత క్రికెట్ జట్టును కలవరపెడుతున్నాయి.  తాజాగా ఇదే విషయమై  భారత క్రికెట్ జట్టు మాజీ  ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  క్రికెటర్లు గాయపడేది గ్రౌండ్ లో కాదని.. జిమ్ లో బరువులెత్తుతూ గాయపడుతున్నారని అన్నాడు.  

ప్రముఖ యూట్యూబర్ ‘ది రన్వీర్ షో’ పోడ్కాస్ట్ కు అతిథిగా వచ్చిన  వీరేంద్ర సెహ్వాగ్ ఈ కామెంట్స్ చేశాడు.   ఈ సందర్భంగా వీరూ భారత క్రికెటర్ల గాయాలపై  స్పందించాడు.  తాము క్రికెట్ ఆడినప్పుడు ఎవరూ కూడా వెన్ను నొప్పితో బాధపడలేదని.. దీనికంతటికి జిమ్ లో బరువులెత్తడమే కారణమని తెలిపాడు. 

వీరూ మాట్లాడుతూ.. ‘అసలు క్రికెటర్లు  వెయిట్ లిఫ్టింగ్ చేయడమేంటో నాకైతే అర్థం కావడం లేదు.  క్రికెట్ లో దీనికి చోటే లేదు.  దానికి బదులు  మీ ఆటను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడే  వ్యాయామాలు చేయాలి.  వెయిట్ లిఫ్టింగ్ వల్ల  ఎముకలు దృఢమవుతాయేమో గానీ  శరీరంపై నొప్పిని కూడా పెంచుతుంది.  అది  క్రికెటర్లకు మంచిది కాదు..’అని చెప్పాడు.  

ఆధునిక కాలంలో క్రికెటర్లకు గాయాలు ఫీల్డ్ లో కంటే  జిమ్ లోనే ఎక్కువ అవుతున్నాయని వీరూ చెప్పాడు.   తాము క్రికెట్ ఆడే సమయంలో సచిన్, ద్రావిడ్,  గంగూలీ, గంభీర్,   వీవీఎస్ లక్ష్మణ్, ధోని, యువరాజ్ సింగ్ లలో ఒక్కరు కూడా వెన్నునొప్పితో   మ్యాచ్ ల నుంచి తప్పుకున్న సందర్భాలులేవు. కానీ ఇప్పుడు ప్రతీ క్రికెటర్ ఈ సమస్యతో బాధపడుతున్నాడని వీరూ చెప్పాడు. ‘కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రోహిత్ శర్మ.. వీళ్లంతా   గాయాల బాధితులే.  వీళ్లంతా   గ్రౌండ్ లో గాయాలైనవారు కాదు.. జిమ్ లలో ఇంజ్యూర్ అయినవాళ్లే..’అని వ్యాఖ్యానించాడు. 

 

క్రికెటర్లు ఫిట్నెస్ పెంచుకోవడంలో తప్పులేదని కానీ వారి శరీర తత్వానికి అనుగుణంగా  ఎక్సర్‌సైజ్ లు చేయడం మంచిదని  వీరూ చెప్పాడు.  ఇందుకు ఉదాహరణగా విరాట్ కోహ్లీని చూపిస్తూ.. ‘మేము క్రికెట్ ఆడే రోజుల్లో  ఏ క్రికెటర్ కూడా వెయిట్ లిఫ్టింగ్  చేయలేదు.  కానీ రోజంతా క్రికెట్ ఆడాం.  ఇప్పటికీ కూడా మేం క్రికెట్ ఆడుతూనే ఉన్నాం.   విరాట్ కోహ్లీ జిమ్ లో గంటలగంటలకు ఉండి బరువులెత్తాడని అందరూ అలా చేస్తానంటే కుదరదు. ఎవరి బాడీకి అనుగుణంగా వాళ్లు వ్యాయామాలు చేయాలి...’అని  తెలిపాడు. ఇదే షో లో  వీరూ మాట్లాడుతూ.. రోహిత్ టెస్టులలో ట్రిపుల్ సెంచరీ చేస్తాడని అభిప్రాయపడ్డాడు. వన్డేలలో మూడు డబుల్ సెంచరీలు చేసిన  హిట్‌మ్యాన్.. టెస్టులలో తన రికార్డును బ్రేక్ చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios