Shane Warne Passes Away: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం పట్ల క్రికెట్ ప్రపంచం షాక్ కు గురైంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త నిజం కాకుంటే బాగుండని...
కండ్లు తెరిచి చూసే లోపు గింగిరాలు తిరుగుతూ వికెట్లను గిరాటేసే బంతులను తన కెరీర్ లో ఎన్నో విసిరిన ప్రపంచపు దిగ్గజ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్.. సగటు స్పిన్ అభిమాని ఊహించని గూగ్లీ విసిరి క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేశాడు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తన విల్లాలోనే కన్నుమూశాడు. వార్న్ మరణ వార్తను క్రికెటర్లు, అతడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వార్త నిజం కాకుంటే బాగుండు అని కన్నీరుమున్నీరవుతున్నారు.
వార్న్ మృతిపై ప్రముఖ క్రికెటర్లు కెవిన్ పీటర్సన్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్, టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, పాకిస్థాన్ ఆటగాడు షోయభ్ అక్తర్,బాబర్ ఆజమ్ లు తమ సంతాపం ప్రకటించారు.
హర్భజన్ సింగ్ స్పందిస్తూ... ‘నో.... ఈ వార్తను నేను నమ్మలేకపోతున్నాను. నేను పూర్తి షాక్ లో ఉన్నాను. నా హీరోకు నివాళి..’ అని ట్వీట్ చేశాడు. వీవీఎస్ లక్ష్మణ్ స్పందిస్తూ.. ‘నేనస్సలు నమ్మలేకపోతున్నా. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. క్రికెట్ లో లెజెండ్.. చాలా ముందుగా తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి..’ అని రాసుకొచ్చాడు.
వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. ‘ఈ వార్తను నమ్మలేకపోతున్నా.. ప్రపంచంలో లెజెండరీ స్పిన్నర్లలో ఒకరు. స్పిన్ కే వన్నె తెచ్చిన బౌలర్ అతడు. ఈ వార్తను జీర్ణించుకోవడం కష్టం. అతడి స్నేహితులు, కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా’ అని పేర్కొన్నాడు.
దినేశ్ కార్తీక్ స్పందిస్తూ.. ‘షేన్ వార్నా..? నిజమా..? ఇది నిజం కాదని చెప్పండి ప్లీజ్..’ అని పేర్కొన్నాడు. ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘షేన్ వార్న్ ఆస్ట్రేలియా క్రికెట్ లో లెజెండ్. తొలి ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్. అతడు మరణించినా ఎప్పటికీ గుర్తుంటాడు..’ అని పేర్కొన్నాడు.
షోయభ్ అక్తర్ స్పందిస్తూ.. ‘ఈ వార్త ను నేను నమ్మలేకపోతున్నా.. నా బాధను వర్ణించడానికి నాకు మాటలు చాలడం లేదు. ఇది నాకు పూర్తిగా షాక్. గొప్ప మనిషి.. గొప్ప క్రికెటర్..’ అని రాశాడు.
తన కెరీర్ లో 145 టెస్టులు ఆడిన వార్న్.. 708 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు) తర్వాత స్థానం వార్న్ దే.. టెస్టులలో 37 సార్లు 5 వికెట్లు, 10 సార్లు పది వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ తరఫున వన్డేలలో 194 మ్యాచులు ఆడి 293 వికెట్లు పడగొట్టాడు.
