సెల్ఫీ కోసం క్రికెటర్ పృథ్వీషాపై ఎగబడిన అభిమానులు... అతని స్నేహితుడి కారును వెంబడించి, బేస్‌బాల్ బ్యాటుతో దాడి... 

యంగ్ క్రికెటర్ పృథ్వీ షాపై కొందరు దుండగులు దాడి చేశారు. ముంబైలోని విలే పార్లే ఈస్ట్‌లో ఉన్న ఓ లగ్జరీ హోటల్‌లో పృథ్వీ షాని కొందరు క్రికెట్ ఫ్యాన్స్, సెల్ఫీ ఇవ్వాల్సిందిగా కోరుతూ మీదకి వచ్చారు. అయితే పృథ్వీ షా వారిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లాడు. దీంతో అతన్ని వెంబడించిన 8 మంది దుండగులు, పృథ్వీ షా స్నేహితుడు ప్రయాణిస్తున్న కారుపై దాడికి పాల్పడ్డారు...

సెల్పీ కోసం పృథ్వీ షాపై ఎగబడడడంతో పరిస్థితిని గమనించిన హోటల్ సిబ్బంది, అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా వాళ్లకు సూచించారు. అయితే క్రికెటర్ కారులో వెళ్తున్నాడని భావించిన ఆ 8 మంది, ఆ వాహనాన్ని వెంబడించారు... నిజానికి పృథ్వీ షా ఆ హోటల్‌లోనే ఉండిపోగా, అతన్ని కలవడానికి వచ్చిన స్నేహితుడు మాత్రమే కారులో ఇంటికి పయనమయ్యాడు.

ఈ విషయం తెలియని దుండగులు, జోగేశ్వరి లింక్ రోడ్డు సమీపంలో కారుని ఆపారు. కారులో పృథ్వీ షా లేకపోవడంతో బేస్‌బాల్ బ్యాట్‌తో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ దాడిలో కారు విండ్‌స్క్రీన్ పూర్తిగా ధ్వంసమైంది. అంతేకాకుండా అంత దూరం వెంబడించి వచ్చినందుకు ప్రతిఫలంగా డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు.

‘క్రికెటర్ పృథ్వీ షాతో సెల్ఫీ దిగడానికి వచ్చిన కొందరు అభిమానులు, అతను నిరాకరించడంతో కారును వెంబడించారు. మరికొందరితో కలిసి కారుపై దాడికి పాల్పడిన వాళ్లు, బాధితుడి నుంచి రూ.50 వేలు కూడా డిమాండ్ చేశారు... బాధితుడు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశాం. విచారణ జరుపుతున్నాం...’ అంటూ తెలియచేశాడు పోలీసు అధికారి. 

పృథ్వీ షా స్నేహితుడితో పాటు ఓ వ్యాపారి ఇచ్చిన కంప్లైట్‌ని స్వీకరించిన ఓసీవారా ఏరియా పోలీసులు, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి... దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.. 

ఆస్ట్రేలియా టూర్‌లో పృథ్వీ షాని ప్రధాన ఓపెనర్‌గా ఎంపిక చేసింది టీమిండియా. అయితే ఆడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 4 పరుగులు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు పృథ్వీ షా. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ దెబ్బకు పృథ్వీ షాని పక్కనబెట్టేసింది టీమిండియా...

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపికైన పృథ్వీ షా, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే ఆఖరి రెండు టెస్టులకు ప్రకటించే జట్టులో తన పేరు ఉంటుందని ఆశపడుతున్నాడు పృథ్వీ షా. అయితే ఇప్పటికే టీమ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, సూపర్ ఫామ్‌లో ఉన్నా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు..

మరోవైపు రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో అదరగొడుతున్న మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్ కూడా టెస్టు టీమ్‌లో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో పృథ్వీ షాకి టెస్టు టీమ్‌కి పిలుపు రావడం దాదాపు అసాధ్యమే..