రంజీ ట్రోఫీలో 400+ వికెట్లు తీసిన మొట్టమొదటి సీమ్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన పంకజ్ సింగ్...2014-15 ఇంగ్లాండ్ టూర్‌లో ఆరంగ్రేటం చేసిన పంకజ్ సింగ్...వికెట్ తీయకుండా, అత్యధిక పరుగులిచ్చిన ఆరంగ్రేటం బౌలర్‌గా చెత్త రికార్డు...

భారత క్రికెటర్ పంకజ్ సింగ్, తన 36 ఏళ్ల వయసులో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో 400 వికెట్లు తీసిన మొట్టమొదటి సీమ్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన పంకజ్ సింగ్‌కి అంతర్జాతీయ కెరీర్‌లో మాత్రం చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు.

టీమిండియా తరుపున 2 టెస్టులు ఆడిన పంకజ్ సింగ్, ఓ వన్డే మ్యాచ్ ఆడాడు. టెస్టు రెండు వికెట్లు తీసిన పంకజ్ సింగ్‌కి, వన్డేలో వికెట్ దక్కలేదు. 2007-08 ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపికైన పంకజ్ సింగ్, రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాయి.

అయితే ఆ తర్వాత రంజీల్లో అద్భుతంగా రాణించడంతో మళ్లీ 2014లో టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. ఇషాంత్ శర్మ గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో ఇంగ్లాండ్‌తో టెస్టులో బరిలో దిగాడు పంకజ్ సింగ్.

ధోనీ చేతుల మీదుగా టెస్టు క్యాప్ అందుకున్న పంకజ్ సింగ్, తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ తీయకుండా అత్యధిక పరుగులు సమర్పించిన ప్లేయర్‌గా చెత్త రికార్డు నమోదుచేశాడు. పంకజ్ సింగ్ బౌలింగ్‌లో అలెస్టర్ కుక్ ఇచ్చిన క్యాచ్‌ను రవీంద్ర జడేజా జారవిడచడంతో అతనికి తొలి మ్యాచ్‌లో వికెట్ దక్కలేదు, తొలి మ్యాచ్‌లో 179 పరుగులు ఇచ్చి, వికెట్లేమీ తీయకుండానే నిరాశగా వెనుదిరిగాడు పంకజ్.

అయితే రెండో మ్యాచ్‌లో తన కెరీర్‌లో 416వ బంతికి పంకజ్‌కి తొలి వికెట్ దక్కింది. జో రూట్‌ను 77 పరుగుల వద్ద అవుట్ చేసిన పంకజ్, ఆ తర్వాత కొద్దిసేపటికే జోస్ బట్లర్ వికెట్ తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 472 వికెట్లు తీసిన పంకజ్ సింగ్‌కి లిస్టు ఏ క్రికెట్‌లో 115 వికెట్లు ఉన్నాయి.