CSA T20 League: ఐపీఎల్ ‘పెద్దల’ సహకారంతో అడుగులు వేస్తున్న క్రికెట్ దక్షిణాఫ్రికా.. ఆ దేశంలో వచ్చే ఏడాది నిర్వహించబోయే కొత్త లీగ్ కు పేరు పెట్టింది.
వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కాబోయే కొత్త లీగ్ కు క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఎ) పేరు పెట్టింది. సీఎస్ఎ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఈ మెగా లీగ్ కు ‘ఎస్ఎ టీ20 లీగ్’ (SA T20 League) అని నామకరణం చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పెద్దల సలహాలు, సూచనలతో సీఎస్ఎ నిర్వహించబోతున్న ఈ మెగా టోర్నీని మినీ ఐపీఎల్ అని క్రికెట్ లోకం పిలుస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లోని ఫ్రాంచైజీలే ఈ లీగ్ లోనూ ఆరు జట్లను సొంతం చేసుకున్నాయి.
మినీ ఐపీఎల్ గా వ్యవహరిస్తున్న ఎస్ఎ టీ20లో ఐపీఎల్ ఫార్ములానే ఇక్కడా వాడుతున్నారు. ఆటగాళ్లను డ్రాఫ్ట్ పద్దతిలో కాకుండా వేలం ద్వారా దక్కించుకునేందుకు సీఎస్ఎ రంగం సిద్ధం చేస్తున్నది. ముందుగా ఆటగాళ్లకు వేలం నిర్వహించి ఆ తర్వాత నాలుగు నెలలకు లీగ్ ను ఘనంగా ప్రారంభించాలని యోచిస్తున్నది.
ఈ మేరకు సెప్టెంబర్ 19న ఎస్ఎ టీ20 లీగ్ లో తొలి వేలం ప్రక్రియ నిర్వహించేందుకు సర్వం సిద్ధమైనట్టు సీఎస్ఎ అధ్యక్షుడు గ్రేమ్ స్మిత్ తెలిపాడు. ప్రక్రియ తుది దశకు చేరుకుందని చెప్పాడు. త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని వివరించాడు. గ్రేమ్ స్మిత్ ఈ లీగ్ కు కమిషనర్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2023 జనవరి 23 నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుందని తెలుస్తున్నది.
ఆరు ఫ్రాంచైజీలకు గాను ఆరింటినీ ఐపీఎల్ యజమానులే సొంతం చేసుకున్న ఈ లీగ్ లో ఇప్పటికే ఆయా జట్లు పేర్లతో పాటు తాము దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలను కూడా వెల్లడించాయి. లీగ్ నిబంధనల ప్రకారం ఒక జట్టు 17 మంది ఆటగాళ్లను సొంతం చేసుకోవడానికి అవకాశముంది. వీరిలో ఐదుగురు ఆటగాళ్లను వేలానికి ముందే దక్కించుకోవచ్చు. వీరిలో ఏడుగురు లోకల్ ప్లేయర్లు, నలుగురు ఫారిన్ ప్లేయర్లు తుది జట్టులో ఆడేందుకు అవకాశముంది. వేలంలో ఒక జట్టు ఏడుగురు ఆటగాళ్లను దక్కించుకోవచ్చు.
ఇప్పటికే ఆరు ఫ్రాంచైజీలు దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలు..
- ఎంఐ కేప్‌టౌన్ (ముంబై ఇండియన్స్) : కగిసొ రబాడా, డెవాల్డ్ బ్రెవిస్, రషీద్ ఖాన్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరన్
- జోహన్నస్‌బర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్) : ఫాఫ్ డుప్లెసిస్, మోయిన్ అలీ, మహేశ్ తీక్షణ, గెరాల్డ్ కోయిట్జ్, రొమారియా షెపర్డ్
- పార్ల్ రాయల్స్ (రాజస్తాన్ రాయల్స్) : డేవిడ్ మిల్లర్, కొర్బిన్ బోష్, జోస్ బట్లర్, ఒబెడ్ మెక్‌కాయ్
- ప్రిటోరియా క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) : అన్రిచ్ నోర్త్జ్, ప్రిటోరియస్
- సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ (సన్ రైజర్స్ హైదరాబాద్) : మార్క్రమ్, బార్ట్మన్
- డర్బన్ (లక్నో సూపర్ జెయింట్స్) : క్వింటన్ డికాక్, జేసన్ హోల్డర్, కైల్ మేయర్స్, రీస్ టాప్లీ, ప్రెన్లన్ సుబ్రయెన్
