Wriddhiman Saha-BCCI: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తో ఓ జర్నలిస్టు దురుసుగా ప్రవర్తించిన ఘటనపై  భారత మాజీ క్రికెటర్లు అతడికి మద్దతుగా నిలిచారు. బీసీసీఐ కూడా.. 

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి-బీసీసీఐ వివాదం ముగిసిపోకముందే.. భారత క్రికెట్ లో మరో వివాదం రాజుకుంది. వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తో పాటు అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మలను శ్రీలంక సిరీస్ లో ఎంపికచేయకపోవడంపై పెద్ద దుమారమే రేగుతున్నది. మిగిలిన ముగ్గురి సంగతి అటుంచితే.. సాహా విషయంలో మాత్రం బీసీసీఐ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో అతడితో ఇంటర్వ్యూ తీసుకుంటానని చెప్పి సాహా పైనే బెదిరింపులకు పాల్పడ్డ జర్నలిస్టు వ్యవహారం ఇప్పుడు టీమిండియాలో హాట్ టాపిక్ గా మారింది. 

ట్విట్టర్ వేదికగా స్పందించిన సాహా.. తనతో ఓ జర్నలిస్టు దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను జతపరుస్తూ ఓ ట్వీట్ చేశాడు. అందులో ‘ఇన్నాళ్లు భారత క్రికెట్ కు సేవ చేసినందుకు గాను ఓ పేరు మోసిన జర్నలిస్టు నుంచి నాకు దక్కుతున్న గౌరవమిది.. జర్నలిజం విలువలు ఎక్కడికి పడిపోయాయో అనేదానికి ఇది నిదర్శనం..’ అని రాసుకొచ్చాడు. 

సాహా చేసిన ట్వీట్ పై దుమారం రేగింది. భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఆర్పీ సింగ్ లతో పాటు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా అతడికి మద్దతుగా నిలిచారు. 

Scroll to load tweet…

భజ్జీ స్పందిస్తూ.. ‘సాహా.. నువ్వు ఆ జర్నలిస్టు పేరు చెప్పు చాలు.. ఇలా ఎవరు చేస్తున్నారో మన క్రికెట్ కమ్యూనిటీకి తెలుస్తుంది. లేకుంటే మంచి జర్నలిస్టులపై కూడా అనుమానం వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఇదేం జర్నలిజం..?’ అని పేర్కొన్నాడు. ఆటగాళ్ల భద్రతను కాపాడాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, జై షా లను ఈ సందర్భంగా భజ్జీ కోరాడు.

Scroll to load tweet…

ఇదే విషయమై రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘ఒక జర్నలిస్టు క్రికెటర్ ను బెదిరించడం షాకింగ్ గా ఉంది. టీమిండియాలో తరుచూ ఇలాగే జరుగుతుండటం బాధాకరం. ఈ విషయంలో బీసీసీఐ దృష్టి సారించాల్సి ఉంది. ఇప్పటికైనా అధ్యక్షుడు గంగూలీ దీని మీద జోక్యం చేసుకోవాలి. ప్రతి క్రికెటర్ కు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చాలా ఆందోళనకరం..’ 

విచారణ జరుపనున్న బీసీసీఐ.. 

సాహా అంశంపై బీసీసీఐ కూడా దృష్టి సారించింది. సదరు జర్నలిస్టు పేరు చెప్పాలని సాహాను బీసీసీఐ కోరింది. ‘సాహా బీసీసీఐ కాంట్రాక్ట్ క్రికెటర్. బీసీసీఐ ప్రతి ఆటగాడి భద్రతపై దృష్టి సారించింది..’ అని బీసీసీఐ కి చెందిన ఓ అధికారి తెలిపాడు. ఈ అంశంపై విచారణ జరిపించేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నది. ఈ విషయంలో త్వరలోనే బీసీసీఐ విచారణ బృందం.. సాహాను కలిసే అవకాశమున్నట్టు సమాచారం.