భారీ వర్షాలతో ఈశాన్య భారతం అతలాకుతలం అవుతోంది. మరీ ముఖ్యంగా అసోంలో పరిస్థితి మరింత దారుణంగా వున్నాయి. బ్రహ్మ పుత్ర తో పాటు ఇతర నదులు వరద నీటితో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ జనావాసాలపై పంజా విసురుతున్నాయి. దీంతో యావత్ రాష్ట్రం కొద్ది రోజులుగా వరదలతో సతమతమవుతూ దేశ ప్రజల సాయాన్ని కోరుతున్నారు. అక్కడి ప్రజల ధీన పరిస్థితిని చూసి చలించిపోయిన సామాన్యులుమ సైతం తోచిన సాయాన్ని అందిస్తున్నారు. ఇలాంటి సమయంలో అసోం వరదలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ఓ ట్వీట్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 

అసోం వరదలపై స్పందిస్తూ కోహ్లీ ఈ విధంగా ట్వీట్ చేశాడు. '' అసోంలో భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదనీటితో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకుని నా  గుండె పగిలింది. ఈ విపత్కర పరిస్థితుల నుండి ప్రతి ఒక్కరు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటున్నా.'' అంటూ కోహ్లీ అసోం పరిస్థితులపై ఆవేధన  వ్యక్తం చేశాడు.

 

అయితే ఈ ట్వీట్ పై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. టీమిండియా క్రికెటర్ గా అత్యధిక ఆర్జన కలిగిన కోహ్లీ ఇలా కేవలం  మాటలతో సరిపెట్టడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కోహ్లీ ట్వీట్ పై కామెంట్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ వంటి సినీ ప్రముఖులు ఇప్పటికే అసోం వరదలపై ఆర్థిక సాయం చేశారు. అలాగే అదే రాష్ట్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన క్రీడాకారిణి హిమదాస్ కూడా ఆర్థిక సాయం చేశారు. వీరిని చూసి కోహ్లీ బుద్దితెచ్చుకోవాలంటూ కొందరు అభిమానులు ఘాటు విమర్శలకు దిగుతున్నారు. 

ఇదే క్రమంలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాపై కూడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసోం టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా వున్న ఆమె ఇప్పటివరకు ఈ వరదలపై స్పందించకపోవడంతో విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. వెంటనే అసోంకు ఆర్థిక సాయం చేసి అక్కడి ప్రజలను ఆదుకుని నిజమైన బ్రాండ్ అంబాసిడర్ అని నిరూపించుకోవాలని ఆమెకు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సలహా ఇస్తున్నారు.