Australia Tour Of Pakistan: ఐపీఎల్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందు  ఆయా జట్లకు క్రికెట్ ఆస్ట్రేలియా ఊహించని షాకిచ్చింది.  సీజన్ ప్రారంభమయ్యాక సుమారు పదిహేను రోజుల దాకా...  

వందల కోట్లు వెచ్చించి ఆటగాళ్లను దక్కించుకున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) షాకిచ్చింది. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ఆయా జట్లు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో సీఏ తీసుకున్న నిర్ణయం.. ఫ్రాంచైజీలకు షాక్ కు గురి చేసింది. ఐపీఎల్ లో వివిధ ప్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ జట్టు ఆటగాళ్లు పాట్ కమిన్స్ (కేకేఆర్), డేవిడ్ వార్నర్ (ఢిల్లీ), జోష్ హెజిల్వుడ్, గ్లెన్ మ్యాక్స్వెల్ (ఆర్సీబీ) వంటి ఆటగాళ్లు ఐపీఎల్-15 ప్రారంభ మ్యాచులకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఏప్రిల్ 6 తర్వాతే వాళ్లు ఐపీఎల్ లోకి అడుగుపెడతారు. 

సుమారు రెండు దశాబ్దాల అనంతరం ఆసీస్.. పాక్ పర్యటనకు రానున్నది. మార్చి 4 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పర్యటన ఏప్రిల్ 5 న పూర్తవుతుంది. కానీ ఐపీఎల్ మాత్రం మార్చి 26 (తాజా నివేదికల ప్రకారం) నే మొదలుకానున్న నేపథ్యంలో.. ఆయా ఐపీఎల్ జట్లు దక్కించుకున్న పలువురు కీలక ఆటగాళ్లు కనీసం నాలుగైదు మ్యాచులైనా దూరమయ్యే అవకాశముంది. 

పాకిస్థాన్ తో ఆస్ట్రేలియా జట్టు పర్యటన షెడ్యూల్ : 

మార్చి 4-8 : తొలి టెస్టు.. రావల్పిండి 
మార్చి 12-16 : రెండో టెస్టు.. కరాచీ 
మార్చి 21-25 : మూడో టెస్టు.. లాహోర్ 
మార్చి 29 : తొలి వన్డే : రావల్పిండి
మార్చి 31 : రెండో వన్డే : రావల్పిండి
ఏప్రిల్ 2: మూడో వన్డే : రావల్పిండి
ఏప్రిల్ 5 : ఏకైక టీ20 : రావల్పిండి

తమ కాంట్రాక్టుతో ఉన్న ఆటగాళ్లందరూ ఏప్రిల్ 6 తర్వాతే ఐపీఎల్ లో (పాకిస్థాన్ పర్యటనలో ఆడనివాళ్లు కూడా..) జాయిన్ అవుతారని సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది ఐపీఎల్ జట్లకు భారీ ఎదురుదెబ్బ వంటిదే. ఆసీస్ ఆటగాళ్లు ఏప్రిల్ 6న జట్లతో చేరినా.. వాళ్లు క్వారంటైన్ పూర్తి చేసుకుని మ్యాచులు ఆడేసరికి కనీసం మరో వారం రోజులైనా వేచి చూడాల్సి ఉంటుంది. అప్పటిదాకా జట్లన్నీ కనీసం నాలుగైదు మ్యాచులు ఆడతాయి.

ఇదే విషయమై ఓ ఐపీఎల్ జట్టు ప్రతినిధి స్పందిస్తూ.. ‘సీఏ తీరు నిరాశకు గురి చేసింది. ఏప్రిల్ 6 దాకా వాళ్లు అందుబాటులో లేకుంటే.. క్వారంటైన్ పూర్తయ్యే సరికి కనీసం ఐదు మ్యాచులైనా ఆడతాం. ఇది జట్లకు నష్టం కలిగించేది. ఇది ఆందోళనకరం. దీనిని మేము బీసీసీఐ దృష్టికి తీసుకెళ్తాం...’ అని తెలిపాడు. 

ఐపీఎల్ లో ఆస్ట్రేలియా కీలక ఆటగాళ్లు : 

- పాట్ కమిన్స్ : కేకేఆర్ (రూ. 7.25 కోట్లు)
- మిచెల్ మార్ష్ : ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 6.50 కోట్లు)
- డేవిడ్ వార్నర్ : ఢిల్లీ (రూ. 6.25 కోట్లు)
- డేనియల్ సామ్స్ : ముంబై (రూ. 2.6 కోట్లు)
- మాథ్యూ వేడ్ : గుజరాత్ (రూ. 2.4 కోట్లు)
- గ్లెన్ మ్యాక్స్వెల్ : ఆర్సీబీ (రూ. 14 కోట్లు
- జోష్ హెజిల్వుడ్ : ఆర్సీబీ (రూ. 7.75 కోట్లు) 
- సీన్ అబోట్ : హైదరాబాద్ (రూ. 2.4 కోట్లు)
- మార్కస్ స్టోయినిస్ : లక్నో (రూ. 9.2 కోట్లు)