Asianet News TeluguAsianet News Telugu

టీ20 వరల్డ్ కప్‌ 2022కి జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా... వార్నర్ భాయ్ లేకుండానే ఇండియాకి...

సెప్టెంబర్ 20 నుంచి టీమిండియాతో టీ20 సిరీస్ ఆడనున్న ఆస్ట్రేలియా... వచ్చే నెలలో టీ20 వరల్డ్ కప్ 2022కి జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా...

Cricket Australia announced Squad for T20 World cup 2022 and Team India tour
Author
First Published Sep 1, 2022, 2:26 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి జట్టును ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడబోతున్న ఆస్ట్రేలియా, ఈసారి పొట్టి ప్రపంచకప్‌కి ఆతిథ్యం కూడా ఇస్తోంది. అక్టోబర్ నెలాఖరున జరిగే టీ20 వరల్డ్ కప్‌తో పాటు సెప్టెంబర్ మూడో వారంలో భారత పర్యటనలో జరిగే మూడు మ్యాచుల టీ20 సిరీస్‌కి కూడా జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా...

సింగపూర్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌కి ఇండియా టూర్‌తో పాటు, టీ20 వరల్డ్ కప్ 2022కి ప్రకటించిన జట్టులోనూ చోటు దక్కింది. సింగపూర్ జట్టు తరుపున 14 టీ20 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన టిమ్ డేవిడ్, ఈ ఏడాది నుంచి ఆస్ట్రేలియా తరుపున ఆడబోతున్నాడు..

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడిన టిమ్ డేవిడ్, 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ టీమ్‌కి ఆడాడు. పాక్ సూపర్ లీగ్‌తో పాటు బిగ్ బిష్ లీగ్‌లో ఆడిన టిమ్ డేవిడ్... 100కి పైగా టీ20 మ్యాచులు ఆడి భారీ హిట్టర్‌గా, ‘మ్యాచ్ విన్నర్’గా పేరు ఘడించాడు.. 

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌కి టీమిండియాతో జరిగే టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అతని స్థానంలో కామెరూన్ గ్రీన్, టీమిండియాతో జరిగే టీ20 సిరీస్‌లో ఆడతాడు. ఆసియా కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత భారత పర్యటనకి వచ్చే ఆస్ట్రేలియా... సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 25 వరకూ మూడు టీ20 మ్యాచుల సిరీస్ ఆడుతుంది...

సెప్టెంబర్ 20న మొహాలీలో తొలి టీ20 ఆడే ఆస్ట్రేలియా- భారత్ జట్లు, ఆ తర్వాత సెప్టెంబర్ 23న నాగ్‌పూర్‌లో రెండో టీ20 ఆడతాయి. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 25న జరిగే మూడో టీ20తో ఈ సిరీస్ ముగుస్తుంది. 

ఇండియాతో సిరీస్‌తో పాటు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఆరోన్ ఫించ్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. అతనితో పాటు స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్ వంటి సీనియర్లకు కూడా ఈ రెండు టోర్నీల్లో చోటు దక్కింది...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ఇది: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, జోష్ హజల్‌వుడ్, జోష్ ఇంగ్లీష్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

ఈ జట్టులో డేవిడ్ వార్నర్ ఒక్కడికీ టీమిండియాతో టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించింది క్రికెట్ ఆస్ట్రేలియా. డేవిడ్ వార్నర్ స్థానంలో కామరూన్ గ్రీన్, భారత పర్యటనకి వస్తాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios