టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు తన కెరీర్ ను అర్థాంతరంగా ముగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ టోర్నీకోసం ఎంపిక చేసిన భారత జట్టులో అతడికి చోటు దక్కకపోవడంతో తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో మరింత  నొచ్చుకున్న అతడు ఏకంగా తనకెంతో ఇష్టమైన క్రికెట్ కు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అయితే ఇలా తొందరపాటు నిర్ణయంతో కెరీర్ ను నాశనం చేసుకుంటున్న తెలుగు క్రికెటర్ రాయుడికి మాజీ కాంగ్రెస్ ఎంపీ, భారత క్రికెట్ సమాఖ్య  ఛైర్మన్ వి హన్మంతరావు మద్దతుగా నిలిచారు. 

రాయుడికి వీహెచ్ మద్దతు

రాయుడు రిటైర్మెంట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ వీహెచ్ టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కు లేఖ రాశాడు. సంబంధిత బిసిసిఐ అధికారులతో మాట్లాడి రాయుడి రిటైర్మెంట్ ను పరిగణలోకి తీసుకోకుండా చూడాలని కోరారు. అంతేకాకుండా తదుపరి టీమిండియా పాల్గొనే సీరిసుల్లో రాయుడికి అవకాశం కల్పించాలని కోరుతూ వీహెచ్ తన లేఖలో పేర్కొన్నారు. 

అంబటి రాయుడు  ప్రతిభావంతుడైన ఆటగాడని వీహెచ్ ప్రశంసించాడు. అలాంటి ఆటగాళ్ల అవసరం టీమిండియాకు వుందన్నారు. రాయుడు అద్భుతమైన బ్యాట్ మెన్ మాత్రమే కాకుండా  మంచి ఫీల్డర్ అని...అవసరమైనపుడు వికెట్ కీపింగ్ కూడా చేయగలడని తెలిపారు. అయితే కేవలం భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటే అతడి కెరీర్ నాశనమవుతుందని...అందువల్లే మానవతాదృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వీహెచ్ కోరాడు. 

రాయుడి రిటైర్మెంట్ కు దారితీసిన సంఘటనలు

ప్రపంచ కప్ కోసం భారత ఆటగాళ్ల ఎంపిక నుండి విజయ్ శంకర్ గాయం తర్వాత జరిగిన పరిణామాలు అంబటి రాయుడిని తీవ్రంగా కలచివేశాయి. అడుగడుగునా అతడిపై బిసిసిఐ, సెలెక్టర్లు పక్షపాతం ప్రదర్శించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మొదట నిలకడగా రాణిస్తున్న రాయుడిని కాదని సెలెక్టర్లు తమిళనాడు ఆలౌ రౌండర్ విజయ్ శంకర్ ను ప్రపంచ కప్ కు ఎంపికచేశారు. రాయుడిని స్టాండ్ బై ఆటగాడిగా ప్రకటించారు. అయితే అప్పుడే తీవ్ర మనోవేదనకు గురైన అతడు త్రీడి కళ్లద్దాలతో ఈ ప్రపంచ కప్ చూస్తానంటూ సెలెక్టర్లపైనే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

అయితే విజయ్ శంకర్ గాయంతో ప్రపంచ కప్ కు దూరమైనా సెలెక్టర్లు రాయుడుకు అవకాశమివ్వలేదు. ముందుగా స్టాండ్ బై గా ప్రకటించిన రాయుడును కాదని మయాంక్ అగర్వాల్ కు ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పించారు. ఇలా రెండోసారి కూడా సెలెక్టర్లు మొండిచేయి చూపించడాన్ని తట్టుకోలేక రాయుడు తనకెంతో ఇష్టమైన క్రికెట్ కెరీర్ ను వదులుకుంటూ సంచలన ప్రకటన చేశాడు.