Asianet News TeluguAsianet News Telugu

కామన్వెల్త్ గేమ్స్ 2022: లంకను చిత్తు చేసిన సఫారీ జట్టు.. 46 పరుగులకే ఆలౌట్...

Commonwealth games 2022: సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయిన శ్రీలంక మహిళా జట్టు... టీ20ల్లో అత్యల్ప స్కోరు నమోదు... 

Commonwealth games 2022: Sri Lanka Women all-out for 46 runs against South Africa
Author
India, First Published Aug 4, 2022, 6:23 PM IST

కామన్వెల్త్ గేమ్స్‌ 2022లో శ్రీలంక మహిళా జట్టుకి ఘోర పరాభవం ఎదురైంది. గ్రూప్ బీలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయ్యి చెత్త రికార్డు మూటకట్టుకుంది లంక మహిళా జట్టు... ఇన్నింగ్స్ తొలి బంతికే హసినీ పెరేరా అవుట్ కావడంతో మొదలైన లంక జట్టు వికెట్ల పతనం ఏ దశలోనూ విరామం లేకుండా 17.1 ఓవర్లలో ఆలౌట్ అయ్యేదాకా సాగింది...

శ్రీలంక కెప్టెన్ చమరీ ఆటపట్టు 15 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు. హర్షిత మాధవి 1, అనుష్క సంజీవని 3, కవిష దిల్హరీ 4, అమ కాంచన 4, స్నేహనీ 9, ఓషడీ రణసింగే 5 పరుగులు చేసి అవుట్ కాగా ఓపెనర్ హసిని పెరేరాతో పాటు నిలాక్షి డి సిల్వ, సుగంధిక కుమారి డకౌట్ అయ్యారు. 

29 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన చమరీ ఆటపట్టు... ఆరో వికెట్‌గా వెనుదిరిగింది. స్నేహనీ రెండు ఫోర్లు బాదగా, కనీష దిల్హరీ ఓ ఫోర్ కొట్టింది. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ బౌండరీ చేయలేకపోయారు. 

సౌతాఫ్రికా బౌలర్లలో నదిని డి క్లెర్క్ 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా మసబత క్లాస్ 3 ఓవర్లలో 7 పరుగులిచ్చి 2 వికెట్ల తీసింది. ఇస్మాయిల్, మల్బా, ట్రయాన్ తలా ఓ వికెట్ తీశారు. ఈ లక్ష్యాన్ని 6.1 ఓవర్లలో ఊడ్చి పారేసింది సౌతాఫ్రికా మహిళా జట్టు...

అన్నీక్ బోస్చ్ 16 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేయగా తస్మిన్ బ్రిట్స్ 21 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసింది. 6.1 ఓవర్లలోనే ఎక్స్‌ట్రాల రూపంలో మరో 8 పరుగులు ప్రత్యర్థికి సమర్పించాడు శ్రీలంక మహిళా జట్టు బౌలర్లు... 

శ్రీలంక మహిళా జట్టుకి టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోరు. అలాగే ఇంగ్లాండ్‌లో వుమెన్స్ టీ20 మ్యాచ్‌లో ఇదే లోయెస్ట్ స్కోరు. అలాగే సౌతాఫ్రికాపై ఓ జట్టు 50 పరుగుల లోపే ఆలౌట్ కావడం కూడా ఇదే తొలిసారి.. 

83 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకున్న సౌతాఫ్రికా మహిళా జట్టు, కెరీర్ బెస్ట్ గణాంకాలను నమోదు చేసింది. ఇంతకుముందు 2013లో బంగ్లాదేశ్‌పై 51 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది సౌతాఫ్రికా మహిళా జట్టు.. 

ఈ పరాజయంతో మూడు మ్యాచుల్లో ఓడిన శ్రీలంక జట్టు, గ్రూప్ బీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి నాకౌట్ రేసు నుంచి తప్పుకుంది. లంకను ఓడించి తొలి విజయాన్ని అందుకున్న సౌతాఫ్రికా మహిళా జట్టు కూడా ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి తప్పుకోవడం విశేషం...

మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓడిన సఫారీ మహిళలు, ఒకే విజయంతో మూడో స్థానంలో నిలిచారు. రెండేసి విజయాలతో టేబుల్ టాప్ 2లో ఉన్న న్యూజిలాండ్, ఇంగ్లాండ్.. గ్రూప్ బీ నుంచి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ టేబుల్ టాపర్‌ని డిసైడ్ చేయనుంది...

గ్రూప్ ఏ నుంచి ఆస్ట్రేలియా, టీమిండియా జట్లు నాకౌట్ స్టేజీకి అర్హత సాధించిన విషయం తెలిసిందే. గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన భారత మహిళా జట్టు, గ్రూప్ బీలో టేబుల్ టాపర్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios