మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇంతకుముందు భారత క్రికెటర్ రవీంద్ర జడేజాను ‘బిట్ అండ్ పీస్ క్రికెటర్’ అంటూ వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచిన సంజయ్ మంజ్రేకర్, మరోసారి అలాంటి వార్తలతోనే ట్రోలింగ్‌కి టార్గెట్ అయ్యాడు. ఐపీఎల్ 2020 మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి అదరగొట్టిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో చావ్లా పొదుపుగా బౌలింగ్ చేసి, కెప్టెన్ రోహిత్ శర్మను అవుట్ చేయగా... చేధనలో అంబటి రాయుడు అదరగొట్టాడు. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌పై స్పందించిన సంజయ్ మంజ్రేకర్... ‘లో-ప్రొఫైల్ క్రికెటర్లు అంబటి రాయుడు, పియూష్ చావ్లా అద్బుతంగా రాణించడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు.

దీంతో మంజ్రేకర్‌ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు అభిమానులు. భారత జట్టుకు 50కి పైగా వన్డేలు ఆడిన అంబటి రాయుడు, రెండు ప్రపంచకప్‌లో సభ్యుడైన పియూష్ చావ్లాను ఓ లో ప్రొఫైల్ క్రికెటర్, లో ప్రొఫైల్ క్రికెటర్లు అనడం కామెడీగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2020 కామెంటరీ ప్యానెల్‌లో సంజయ్ మంజ్రేకర్‌కి చోటు దక్కలేదు.