మొదటి మూడు టెస్టుల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన భారత టెయిలెండర్లు... కీలకమైన నాలుగో మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతమే చేశారు. 186 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టును శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ కలిసి శతాధిక భాగస్వామ్యంతో ఆదుకోగా, సిరాజ్, నటరాజన్ కూడా మూడు ఓవర్లు బ్యాటింగ్ చేశారు.

ఆసీస్ టూర్‌లో ఓ వన్డే, మూడు టీ20 మ్యాచులు ఆడినప్పటికీ నటరాజన్‌కి ఎప్పుడూ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. గబ్బా టెస్టులో తొలిసారి బ్యాటు పట్టుకుని క్రీజులోకి వచ్చిన నటరాజన్... మిచెల్ స్టార్క్ ఓవర్‌ మొత్తం డిఫెన్స్ చేశాడు.

మూడో రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత శార్దూల్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్‌లను ఇంటర్వ్యూ చేసిన రవిచంద్రన్ అశ్విన్ ఈ విషయం గురించి ప్రశ్నించాడు. ‘స్టార్క్ బౌలింగ్‌లో ఓవర్ మొత్తం కంఫర్టబుల్‌గా ఆడావ్... ఎలా అనిపించింది?’ అంటూ అశ్విన్ అడిగిన ప్రశ్నకి... ‘కంఫర్టబులా? నాకు మొదటి బంతి కనిపించనే లేదు అన్నా’ అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు నట్టూ. నిర్మొహమాటంగా నట్టూ చెప్పిన ఈ ఆన్సర్, సోషల్ మీడియా జనాలకు, టీమిండియా ఫ్యాన్స్‌కి తెగ నచ్చేసింది.