Asianet News TeluguAsianet News Telugu

న్యూజిలాండ్‌కి మరో షాక్... రిటైర్మెంట్ ప్రకటించిన ఆల్‌రౌండర్ కోలిన్ డి గ్రాండ్‌హోమ్...

36 ఏళ వయసులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న కోలిన్ డి గ్రాండ్‌హోమ్... 

Colin De Grandhomme announced retirement from international cricket
Author
First Published Aug 31, 2022, 12:07 PM IST

కివీస్ స్టార్ బౌలర్ ట్రెండ్ బౌల్ట్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత న్యూజిలాండ్‌కి మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కోలిన్ డి గ్రాండ్‌హోమ్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్న కోలిన్ డి గ్రాండ్‌హోమ్... సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నాడు. 


36 ఏళ్ల కోలిన్ డి గ్రాండ్‌హోమ్ తన కెరీర్‌లో 29 టెస్టులు ఆడి 38.70 సగటుతో 1432 పరుగులు చేశాడు. వెస్టిండీస్, సౌతాఫ్రికాలపై సెంచరీలు చేసిన కోలిన్ డి గ్రాండ్‌హోమ్, తన టెస్టు కెరీర్‌లో 49 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే 6 వికెట్లు పడగొట్టిన గ్రాండ్‌హోమ్, టెస్టుల్లో 4054 బంతులు బౌలింగ్ చేసినా ఒక్క సిక్సర్ కూడా ఇవ్వలేదు...

45 వన్డేలు, 41 టీ20 మ్యాచులు ఆడిన కోలిన్ డి గ్రాండ్‌హోమ్, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 7 హాఫ్ సెంచరీలు చేశాడు. 2012లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన కోలిన్ డి గ్రాండ్‌హోమ్... ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరుపున ఆడాడు...

2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన కోలిన్ డి గ్రాండ్‌హోమ్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడం న్యూజిలాండ్ జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది...

గత ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టు సిరీస్ గెలిచిన న్యూజిలాండ్, ఈ ఏడాది వరుసగా మూడు టెస్టుల్లో చిత్తుగా ఓడింది. తొలి టెస్టు తర్వాత గాయపడిన కోలిన్ డి గ్రాండ్‌హోమ్, మిగిలిన రెండు టెస్టుల్లో ఆడలేదు. గాయాలతో సతమతమవుతూ కెరీర్‌ని కొనసాగించడం కష్టమని భావించిన కోలిన్, అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు...

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 50 బంతుల్లో 42 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు కోలిన్ డి గ్రాండ్‌హోమ్. అసలే కెప్టెన్ కేన్ విలియంసన్ ఏడాదిన్నరగా ఫామ్‌లో లేడు. గత ఏడాది టీమిండియాని ఓడించి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు,ఈ ఏడాది ఐసీసీ డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో అలాంటి పర్పామెన్స్ ఇవ్వడం లేదు. 

డబ్యూటీసీ ఫైనల్ తర్వాత రెండు మూడు నెలల పాటు ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న న్యూజిలాండ్, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో 9 టెస్టులు ఆడితే 2 విజయాలు మాత్రమే అందుకోగలిగింది. 6 టెస్టుల్లో ఓడి, ఓ టెస్టును డ్రా చేసుకున్న న్యూజిలాండ్, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది... 

Follow Us:
Download App:
  • android
  • ios