దాయాది దేశం పాకిస్థాన్ తో భారత్ గతకొన్నేళ్లుగా అన్ని రకాల సంబంధాలను తెంచుకున్న విషయం తెలిసిందే. ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలనే కాదు చివరకు క్రికెట్ సంబంధాలను కూడా భారత్ తెంచుకుంది. ఇలా తాజ్ హోటల్ పై ముష్కరుల దాడితో పూర్తిగా తెగిపోయిన ఇరుదేశాల క్రికెట్ సంబంధాలు తాజాగా పుల్వామా దాడితో మరింత దిగజారాయి. ఇలాంటి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత  కొనసాగుతున్న సమయంలో భారత క్రికెట్ పరిపాలన కమిటీ(సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ ఇండోపాక్ క్రికెట్ సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ద్వైపాక్షిక సీరిసుల్లో కాదు ఐసిసి టోర్నీల్లో కూడా పాకిస్థాన్ తో టీమిండియా ఆడొద్దంటూ పెద్దఎత్తున భారత ప్రజలు డిమాండ్ పెరిగింది. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ సమయంలో బిసిసిఐ కూడా ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ టోర్నీ ముగిసి కనీసం రెండు నెలలు కూడా కాకుండానే బిసిసిఐ మనసుమార్చుకున్నట్లుంది. పాకిస్థాన్ జట్టుతో క్రికెట్ ఆడేందుకు భారత్ సిద్దంగా వుందంటూ సుప్రీంకోర్టు నియమిత సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ అభిప్రాయపడ్డారు. అయితే అందుకు పాకిస్థాన్ వేదికకాకుండా వుంటే చాలని స్ఫష్టం చేశారు. 

ఇప్పటికే పాకిస్థాన్ లో పర్యటించేందుకు అంతర్జాతీయ జట్లన్ని వెనుకడుగు వేస్తున్నాయి. కాబట్టి యూఏఈ వంటి తాత్కాలిక వేదికలపై పాక్ ఇన్నిరోజులూ ఆడాల్సి వచ్చింది. కానీ ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాత్కాలిక వేదికలపై కాకుండా స్వదేశంలోనే అంతర్జాతీయ మ్యాచులు నిర్వహించేందుకు సిద్దమయ్యింది. అతిత్వరలో పాక్-శ్రీలంక ల మధ్య ఓ సీరిస్ కూడా జరగనుంది. 

పాకిస్థాన్ ఇకపై కేవలం స్వదేశంలోనే ఆడాలన్న నిర్ణయాన్ని వినోద్ రాయ్ వ్యతిరేకించారు. గతంలో మాదిరిగా తాత్కాలిక వేదికలపై ఆడటమే ఆ జట్టు ఆటగాళ్లతో పాటు పర్యాటక జట్టు ఆటగాళ్లకు కూడా మంచిదని సూచించారు. భద్రతాపరంగా యూఏఈ వంటి దేశాలు చాలా సేఫ్ అని... అక్కడ పాక్ తో ద్వైపాక్షిక సీరిస్ లు ఆడేందుకు భారత్ కూడా సిద్దమేనని సీఓఏ చీఫ్ వెల్లడించారు.