అడిలైడ్‌: పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజమ్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్‌ క్లార్క్‌  ప్రశంసలు కురిపించాడు. ప్రపంచకప్‌లో పాకిస్తాన్ కు అతడే కీలకమవుతాడని క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు. అతను ఉత్తమమైన క్లాసిక్‌ ప్లేయర్‌  అని అన్నాడు.

బాబర్ పాకిస్తాన్ విరాట్ కోహ్లి అంటూ క్లార్క్ అభివర్ణించాడు. బాబర్ ఆజాం బ్యాటింగ్ శైలి కూడా అచ్చం కోహ్లిలానే ఉంటుందని అన్నాడు.  ప్రపంచకప్‌లో పాక్‌ విజయం సాధించాలంటే ఈ ఆటగాడిపై ఆధారపడాల్సిందేనని అన్నాడు. అతితక్కువ కాలంలోనే బాబర్‌ తన ఖాతాలో అరుదైన రికార్డులను నమోదు చేశాడని క్లార్క్‌ గుర్తు చేశాడు. 

వార్మప్‌ మ్యాచ్‌లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బాబర్‌ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో బాబర్‌ 108 బంతుల్లో 112 పరుగులు సాధించాడు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. దీంతో 262 పరుగులకే పాక్‌ కుప్పకూలింది. 

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన అఫ్గాన్‌ హాష్మతుల్లా షాహిది(74 నాటౌట్‌), హజ్రతుల్లా జజాయి(49) బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్‌ను గెలిపించారు. ప్రపంచకప్‌లో భాగంగా మే31న పాక్‌ తన తొలిపోరులో మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌తో తలపడనుంది.