ఎసొంటెసొంటి మ్యాచ్‌లు ఆడేటోళ్లు.. ఏం హాలత్ అయిపోయింది..! ‘అర్హత’ కోల్పోయిన విండీస్‌పై పేలుతున్న జోకులు

T20 World Cup 2022: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించిన వెస్టిండీస్ ప్రభ తర్వాత మసకబారింది. కానీ టీ20 క్రికెట్ పురుడు పోసుకున్నాక  వెస్టిండీస్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ బ్యాక్ టు పెవిలియన్ కు అన్నట్టుగా తయారైంది ఆ జట్టు పరిస్థితి. 
 

Chris Gayle Predicts west Indies Will Face Australia in T20 WC 2022, But Nicholas Pooran and Co not Even Qualified, Netizens Trolls

ప్రపంచ క్రికెట్ లో వెస్టిండీస్‌ జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. నాటి తరం వివిన్ రిచర్డ్స్, గ్యారీ సోబర్స్, క్లైవ్ లాయిడ్, మాల్కమ్ మార్షల్, ఆండీ రాబర్ట్స్, కర్ట్లీ ఆంబ్రోస్ వంటి దిగ్గజాలు సుమారు దశాబ్దంన్నర పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించారు.  టెస్టు, వన్డే క్రికెట్ లో కరేబియన్ జట్టుకు ఎదురే లేదు. వరుసగా రెండు వన్డే ప్రపంచకప్ (1975, 1979) లు గెలిచిన వెస్టిండీస్ కు 1983లో భారత్ షాకిచ్చింది. అయితే  ప్రపంచకప్ ఓడినా  ఆ జట్టు స్థాయి మాత్రం తగ్గలేదు. కానీ సీనియర్లు ఒక్కరొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటించడం..  అదే సమయంలో క్రికెట్ లో ఆస్ట్రేలియా ఆధిపత్యం మొదలయ్యాక  విండీస్ ప్రభ క్రమంగా తగ్గిపోయింది. 90వ దశకం వచ్చేసరికి విండీస్ కూడా అసాధారణ జట్టు నుంచి సాధారణ స్థాయి కంటే తక్కువ ప్రదర్శనలు చేసింది. 

కానీ టీ20 క్రికెట్ పురుడు పోసుకున్నాక వెస్టిండీస్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. పొట్టి క్రికెట్ పుణ్యమా అని  కరేబియన్ దీవుల్లో  క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్ వంటి బంతిని బలంగా బాదే హిట్టర్లు.. డారెన్ సామి,  డ్వేన్ బ్రావో వంటి దిగ్గజ బౌలర్లు పుట్టుకొచ్చారు. ప్రపంచ క్రికెట్ లో ఏ  దేశంలో ఫ్రాంచైజీ లీగ్  జరిగినా తప్పకుండా దర్శనమిచ్చే క్రికెటర్లలో విండీస్ ఆటగాళ్లు తప్పకుండా ఉండేవాళ్లు.  

రెండు సార్లు ఛాంపియన్.. 

టీ20 క్రికెట్ పుణ్యమా  అని  విండీస్ ఆటగాళ్లలో చాలా మంది ఆల్ రౌండర్లే తయారయ్యారు.  అందుకే  వన్డే క్రికెట్  లో మాదిరిగానే  టీ20 క్రికెట్ లో  కూడా వెస్టిండీస్.. రెండు ప్రపంచకప్ లను నెగ్గింది.  2012 తో పాటు 2016 లో పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిచింది.  వీటితో పాటు ఓడిపోతుంది అనుకున్న ఎన్నో మ్యాచ్ లలో విండీస్ ఆటగాళ్ల అసాధారణ ప్రతిభతో వాటిలో తిరిగి విజయాలు సాధించారు.  

డారెన్ సామి  నేతృత్వంలోని జట్టులో డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్, కార్లోస్ బ్రాత్‌వైట్, క్రిస్ గేల్, జేసన్ హోల్డర్, ఎవిన్ లూయిస్, ఆండ్రూ రసెల్, లెండి సిమన్స్, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్ వంటి ఆటగాళ్లు మెరుపులు మెరిపించారు. కానీ వన్డే, టెస్టు క్రికెట్ లో మాదిరిగానే  టీ20లో కూడా  ఆ జట్టు ప్రభ కోల్పోతున్నది.  

పొలార్డ్, బ్రావో రిటైర్మెంట్.. బోర్డుతో రసెల్, హెట్మెయర్ వంటి ఆటగాళ్ల విభేదాలు,  అనుభవలేమి కారణంగా ఆ జట్టు అతలాకుతలమైంది. గతేడాది ప్రదర్శన సరిగా లేకపోవడంతో ఈసారి ఆ జట్టు  టీ20 ప్రపంచకప్ కు కనీసం సూపర్-12కు అర్హత కూడా సాధించలేదు. దీంతో ఆ జట్టు  క్వాలిఫై ఆడాల్సి వచ్చింది.   

 

‘అర్హత’ లేదు..   

అర్హత రౌండ్లలో భాగంగా తొలి మ్యాచ్ లో స్కాట్లాండ్ చేతిలో ఓడిన విండీస్ తర్వాత జింబాబ్వేను ఓడించి క్వాలిఫై ఆశలను సజీవంగా నిలుపుకుంది.  ఇక తాజాగా  ఐర్లాండ్ తో ముగిసిన మ్యాచ్ లో  9 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.  ఈ మ్యాచ్ ఓటమితో విండీస్ అభిమానులతో పాటు నెటిజన్లు  వెస్టిండీస్  దిగ్గజ ఆటగాడు  క్రిస్ గేల్ ను ఆటాడుకుంటున్నారు.  

ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు  గేల్..  ఈ ప్రపంచకప్ ఫైనల్ ఆస్ట్రేలియా-వెస్టిండీస్ నడుమ జరగుతుందని అంచనా వేశాడు.  గేల్ మాట్లాడుతూ.. ఈ ప్రపంచకప్ ఫైనల్ ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య జరుగుతుందని నేను భావిస్తున్నా. అయితే విండీస్ జట్టుకు ఫైనల్ చేరడం అంత ఈజీ కాదు. కీరన్  పొలార్డ్, ఆండ్రూ రసెల్, డ్వేన్ బ్రావో వంటి ఆటగాళ్లు లేకుండా వెస్టిండీస్ ఈ ప్రపంచకప్ లో బరిలోకి దిగుతున్నది. కానీ ప్రస్తుత విండీస్ జట్టులో చాలా మంది ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉన్నారు. ఈ క్రికెటర్లు ప్రపంచంలో ఏ జట్టుకైనా కఠిన సవాళ్లు విసరగలరు. మ్యాచ్ సమయానికి పరిస్థితులను వాళ్లకు అనుకూలంగా మార్చుకోగలిగితే  అప్పుడు విండీస్ ను ఆపడం ఎవరితరమూ కాదు..’ అని అన్నాడు.   కానీ   రెండు సార్లు ఛాంపియన్ అయిన విండీస్ మాత్రం ఈసారి అర్హత కూడా సాధించకుండా వెనుదిరగడం గమనార్హం. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios