IPL 2022 Finals: ఐపీఎల్ - 15 ఫైనల్ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ కు ఓ అనుకోని అతిథి నుంచి మద్దతు లభించింది. తమ ప్రత్యర్థి జట్టులో ఉన్న ఓ ఆటగాడు.. తమకు మద్దతుగా స్టేడియానికి వచ్చాడు.
ఐపీఎల్ ద్వారా తన కెరీర్ ను మార్చిన రాజస్తాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు చేతన్ సకారియా తన గురుభక్తిని చాటుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ లో రాజస్తాన్ కు మద్దతు పలికాడు. తాను ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నప్పటికీ.. రాజస్తాన్ రాయల్స్ జెర్సీ వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ - రాజస్తాన్ మధ్య జరిగిన ఫైనల్ పోరులో సకారియా.. రాజస్తాన్ రాయల్స్ జెర్సీ వేసుకుని తన పాత జట్టుకు మద్దతు ప్రకటించాడు.
సకారియా.. 2021 సీజన్ లో రాజస్తాన్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఆ సీజన్ లో రాజస్తాన్ తరఫున 14 మ్యాచులాడిన అతడు.. 52 ఓవర్లు బౌలింగ్ చేసి 17 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్ లో రాజస్తాన్ అతడిని రూ. 1.20 కోట్లను కొనుగోలు చేయడమే గాక ప్రతి మ్యాచ్ లో ఆడే అవకాశమిచ్చింది.
రాజస్తాన్ నమ్మకాన్ని సకారియా ఎప్పుడూ వమ్ము చేయలేదు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లైన్ అండ్ లెంగ్త్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. అతడి ప్రతిభను చూసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి సకారియాకు రూ. 4.20 కోట్లు వెచ్చించి తమ జట్టులోకి తీసుకుంది. అయితే ఈ సీజన్ లో అతడికి 3 మ్యాచులు మాత్రమే ఆడే అవకాశమిచ్చింది. 3 ఇన్నింగ్స్ లలో 11 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు.. 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
కాగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించకపోవడంతో సకారియా.. ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి వచ్చాడు. రాజస్తాన్ రాయల్స్ జెర్సీ వేసుకుని స్టాండ్స్ లో కూర్చుని మ్యాచ్ చూశాడు. రాజస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పలు కెమెరాలు అతడిని ఫోకస్ చేశాయి. రాజస్తాన్ జెర్సీ వేసుకుని మ్యాచ్ చూస్తున్న సకారియా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున జోస్ బట్లర్ (39) ఒక్కడే టాప్ స్కోరర్ గా ఉన్నాడు. యశస్వి జైస్వాల్ (22) ఫర్వాలేదనిపించాడు. గుజరాత్ బౌలర్లలో హార్ధిక్ పాండ్యా.. 4 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్.. 18.1 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి ఆడిన తొలి సీజన్ లోనే ట్రోఫీని నెగ్గింది. శుభమన్ గిల్ (45 నాటౌట్), హార్దిక్ పాండ్యా (34) నిలకడకు తోడు డేవిడ్ మిల్లర్ (32 నాటౌట్) దూకుడుగా ఆడటంతో గుజరాత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో తాము ఐపీఎల్ ఆడిన తొలి సీజన్ లోనే ట్రోఫీ నెగ్గిన జట్టుగా రికార్డు సొంతం చేసుకుంది.
