131 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్లతో 174 పరుగులు చేసిన కెప్టెన్ ఛతేశ్వర్ పూజారా... రాయల్ లండన్ వన్డే కప్‌లో వరుసగా రెండో సెంచరీ... 

భారత టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా, భారత జట్టు తరుపున ఆడింది ఐదు వన్డేలు మాత్రమే. స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడనే కారణంగా ఐదు వన్డేల తర్వాత పూజారాని పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి పక్కనబెట్టేసింది టీమిండియా. అయితే రాయల్ లండన్ వన్డే కప్ 2022లో విశ్వరూపమే చూపిస్తున్నాడు ఛతేశ్వర్ పూజారా...

టెస్టుల్లో ఓవర్లకు ఓవర్లు ఆడుతూ జిడ్డు బ్యాటింగ్, డిఫెన్స్‌తో బౌలర్లను విసిగించే పూజారా, రాయల్ కప్‌లో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. వార్‌విక్‌షైర్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 బంతుల్లో సెంచరీ చేసిన ఛతేశ్వర్ పూజారా, తాజాగా సుర్రేతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ భారీ సెంచరీతో విశ్వరూపం చూపించాడు...

Scroll to load tweet…

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సుసెక్స్, నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 378 పరుగుల భారీ స్కోరు చేసింది. అలెస్టర్ ఓర్ 4, హారిసన్ వార్డ్ 5 పరుగులు చేసి అవుట్ కావడంతో 9 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది సుసెక్స్. అయితే మూడో వికెట్‌కి టామ్ క్లార్క్‌తో కలిసి 205 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు ఛతేశ్వర్ పూజారా...

106 బంతుల్లో 13 ఫోర్లతో 104 పరుగులు చేసిన టామ్ క్లార్క్ అవుటైన తర్వాత వికెట్ కీపర్ టామ్ అల్సాప్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 85 పరుగులు జోడించాడు పూజారా. ఆ తర్వాత డెల్రే రావిన్స్‌తో 49 పరుగులు జత చేశాడు.

టామ్ అల్సాప్ 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 22 పరుగులు చేయగా, డెల్రే రావిన్స్ 13 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేశాడు. ఛతేశ్వర్ పూజారా 131 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్లతో 174 పరుగులు చేసిన కెప్టెన్ ఛతేశ్వర్ పూజారా, వరుసగా రెండో సెంచరీ బాదాడు. 

లిస్టు ఏ క్రికెట్‌లో ఛతేశ్వర్ పూజారాకి ఇదే అత్యధిక స్కోరు. ఇంతకుముందు దేశవాళీ టోర్నీలో సౌరాష్ట్ర తరుపున 158 పరుగులు నాటౌట్‌గా నిలిచిన పూజారా, ఆ స్కోరును దాటేశాడు. 

పూజారా ఆడిన ఆఖరి 20 బంతుల్లో 53 పరుగులు రాబట్టడం విశేషం... అంతకుముందు కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022లో 8 మ్యాచులు ఆడిన ఛతేశ్వర్ పూజారా 13 ఇన్నింగ్స్‌ల్లో 109.40 సెన్సేషనల్ యావరేజ్‌తో 1094 పరుగులు చేశాడు...

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పూజారా స్ట్రైయిక్ రేటు 60.11. కౌంటీ 2022 సీజన్‌లో 10 మ్యాచులు ఆడి 19 ఇన్నింగ్స్‌ల్లో 1127 పరుగులు చేసిన సామ్ నార్‌ఈస్ట్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ఛతేశ్వర్ పూజారానే. సీజన్‌లో 5 సెంచరీలు చేసిన పూజారా, అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు...

ఛతేశ్వర్ పూజారా మాస్ బ్యాటింగ్‌తో టీమిండియా వన్డే టీమ్‌లో చోటు కోసం శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా వంటి కుర్రాళ్లతో పోటీపడేందుకు సిద్ధమవుతున్నాడని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు..