ఛతేశ్వర్ పూజారా ‘ధనాధన్’ సెంచరీ! ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా... బంగ్లా ముందు భారీ టార్గెట్...
130 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ చేసిన ఛతేశ్వర్ పూజారా... మూడేళ్ల సుదీర్ఘ విరామానికి బ్రేక్.. శుబ్‌మన్ గిల్ తొలి సెంచరీ.. బంగ్లాదేశ్ ముందు 512 పరుగుల కొండంత లక్ష్యం పెట్టిన టీమిండియా..

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల ఆధిక్యం అందుకున్న తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో61.4 ఓవర్లు బ్యాటింగ్ చేసి 258/2 పరుగులకి డిక్లేర్ చేసింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి బంగ్లాదేశ్ ముందు 513 పరుగుల కొండంత లక్ష్యాన్ని పెట్టింది...
జిడ్డు బ్యాటింగ్‌తో బౌలర్లను విసిగించడం ఛతేశ్వర్ పూజారా స్పెషాలిటీ. అలాంటి పూజారా రివర్స్ స్వీప్స్, ఫ్రంట్ ఫుట్‌కి వచ్చి బౌండరీలు బాదడం ఆడి అభిమానులకు షాక్ ఇచ్చాడు. మొదటి సింగిల్ తీయడానికి 50+ బంతులు ఆడి, హాఫ్ సెంచరీ అందుకోవడానికే 140-150 బంతులు తీసుకునే ఛతేశ్వర్ పూజారా... ధనాధన్ బ్యాటింగ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు...
మొదటి 87 బంతుల్లో 41 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా... 130 బంతుల్లో 13 ఫోర్లతో 102 పరుగులు చేశాడు.ఛతేశ్వర్ పూజారా కెరీర్‌లో ఇదే ఫాస్ట్ సెంచరీ. 52 ఇన్నింగ్స్‌లు, 1400+ రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ అందుకున్నాడు ఛతేశ్వర్ పూజారా. పూజారా సెంచరీ తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది టీమిండియా. విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
రెండో ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ కలిసి తొలి వికెట్‌కి 70 పరుగులు జోడించారు. 62 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఖలీద్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మొదటి 54 బంతుల్లో 17 పరుగులే చేసిన శుబ్‌మన్ గిల్, ఆ తర్వాత గేరు మార్చి బ్యాటింగ్ చేశాడు. 147 బంతుల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు గిల్.
సెంచరీ పూర్తి చేసుకున్న కొద్ది సేపటికే శుబ్‌మన్ గిల్ అవుట్ అయ్యాడు. 152 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 110 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మెహిదీ హసన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి మోమినుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరో ఎండ్‌లో ఛతేశ్వర్ పూజారా 87 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు...
పూజారా- శుబ్‌మన్ గిల్ కలిసి రెండో వికెట్‌కి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 133/8 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన బంగ్లాదేశ్, 55.5 ఓవర్లలో 150 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టీమిండియాకి 254 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. బంగ్లాని ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపించింది...
మూడో రోజు మెహిదీ హసన్ మిరాజ్‌తో 9వ వికెట్‌కి 42 పరుగులు జోడించిన ఎబదత్ హుస్సేన్, 37 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 82 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసి... అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
కుల్దీప్ యాదవ్‌కి ఐదు వికెట్లు దక్కగా మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్ చెరో వికెట్ తీశారు.