Asianet News TeluguAsianet News Telugu

తొలి ఇన్నింగ్స్‌లో అటు వైపు, ఇప్పుడు ఇటు వైపు... వార్మప్ గేమ్‌లో టీమ్ మారిన ఛతేశ్వర్ పూజారా..

తొలి ఇన్నింగ్స్‌లో లీస్టర్‌షైర్ తరుపున బ్యాటింగ్‌కి వచ్చి షమీ బౌలింగ్‌లో డకౌట్ అయిన ఛతేశ్వర్ పూజారా... రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా తరుపున బ్యాటింగ్‌కి వచ్చిన పూజారా... 

Cheteshwar Pujara came to bat for India's side in the second innings along with Virat Kohli
Author
India, First Published Jun 25, 2022, 6:56 PM IST

గల్లీ క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఇటు వైపు ఆడిన ప్లేయర్, బౌలింగ్ చేసేటప్పుడు అవతల టీమ్ తరుపున ఆడడం చాలా కామన్. ప్లేయర్లు తగ్గితే ఇలాంటి సర్దుబాట్లు చేస్తుంటారు. గల్లీ క్రికెట్‌లోనే కాదు, ఇప్పుడు ఇలాంటి సీన్ కౌంటీ టీమ్‌తో టీమిండియా ఆడుతున్న వార్మప్ మ్యాచ్‌లోనూ ఆవిష్కృతమైంది...

భారత టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా తొలి ఇన్నింగ్స్‌లో లీస్టర్‌షైర్ టీమ్ తరుపున బరిలో దిగి, భారత బౌలర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆరు బంతులాడిన పూజారాని బౌల్డ్ చేసిన తర్వాత అతనిపైనే చేతులు వేసి సెలబ్రేట్ చేసుకున్నాడు మహ్మద్ షమీ...

లీస్టర్‌షైర్ తరుపున ఆడితే మహ్మద్ షమీని ఎదుర్కోవడం కష్టంగా ఉందని అనుకున్నాడో ఏమో, రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా తరుపున బ్యాటింగ్‌కి వచ్చాడు ఛతేశ్వర్ పూజారా. నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో ఇప్పటికే 3 రోజులు ముగియడం, మూడో రోజు ఉదయం వర్షం కురవడంతో లీస్టర్‌షైర్ తరుపున ఆడితే పూజారాకి బ్యాటింగ్ రాకపోవచ్చని, అతన్ని టీమ్‌ మార్పించి బ్యాటింగ్‌కి పంపింది భారత జట్టు...

టీమిండియా తరుపున విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా బ్యాటింగ్ చేస్తుంటే వారికి జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ చేయడం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చిన శ్రీకర్ భరత్ 98 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు చేయగా శుబ్‌మన్ గిల్ 34 బంతుల్లో 8 ఫోర్లతో 38 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో లీస్టర్‌షైర్‌ టీమ్‌లో చేరిన భారత బౌలర్ నవ్‌దీప్ సైనీ, ఈ ఇద్దరినీ పెవిలియన్ చేర్చడం విశేషం...

నవ్‌దీప్ సైనీతో పాటు ఇంగ్లాండ్ టూర్‌ని నెట్ బౌలర్లుగా ఎంపికైన కమ్లేశ్ నాగర్‌కోటీ, రవిశ్రీనివాసన్ సాయికిషోర్ కూడా కౌంటీ టీమ్ తరుపున బౌలింగ్ చేశారు. హనుమ విహారి 55 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేయగా శ్రేయాస్ అయ్యర్ 42 బంతుల్లో 6 ఫోర్లతో 30 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు...

రవీంద్ర జడేజా, నవ్‌దీప్ సైనీ బౌలింగ్‌లో డకౌట్ కాగా శార్దూల్ ఠాకూర్ 38 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 37, ఛతేశ్వర్ పూజారా 27 బంతుల్లో 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. 57 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసిన టీమిండియా, లీస్టర్‌షైర్‌పై 224 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది...  నవ్‌దీప్ సైనీకి మూడు వికెట్లు దక్కగా, యంగ్ బౌలర్ కమ్లేశ్ నాగర్‌కోటికి ఓ వికెట్ దక్కింది. కౌంటీ ప్లేయర్ విల్ డేవిస్ ఓ వికెట్ తీశాడు.

Follow Us:
Download App:
  • android
  • ios