జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా భారత మాజీ పేసర్ చేతన్ శర్మ ఎంపికయ్యాడు. మదన్ లాల్, ఆర్పీసింగ్, సులక్షణా నాయక్ లతో కూడిన క్రికెట్ కమిటీ వర్చువల్ గా సమావేశమైన అనంతరం  చేతన్ పేరును సిఫారసు చేసింది.

మరో సీనియర్ అజిత్ అగార్కర్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ.. కమిటీ చేతన్ వైపే మొగ్గుచూపింది. అలాగే అబే కురువిల్లా, దేవాశీష్‌ మొహంతిలను కమిటీ సభ్యులుగా ఎంపిక చేసింది. వీరిలో చేతన్‌ నార్త్‌ జోన్‌, కురువిల్లా వెస్ట్‌, మొహంతి ఈస్ట్‌ జోన్లకు ప్రాతినిథ్యం వహిస్తారు. ఈ ముగ్గురూ పేస్‌ బౌలర్లే కావడం విశేషం. 

అత్యధిక టెస్ట్‌లాడిన చేతన్‌ శర్మను సీనియారిటీ ప్రాతిపదికన చైర్మన్‌గా ఎంపికచేశారు. ఈమేరకు వివరాలను బీసీసీఐ గురువారం వెల్లడించింది. సునీల్‌ జోషి స్థానంలో చేతన్‌ శర్మ చైర్మన్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. జోషితోపాటు హర్విందర్‌ సింగ్‌ సెలెక్టర్లుగా కొనసాగుతారు. 

కాగా 16ఏళ్లకే అరంగేట్రం చేసిన చేతన్‌ శర్మ తన 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 23 టెస్టులు, 65 వన్డేలు ఆడాడు. 1987 వరల్డ్‌క్‌పలో న్యూజిలాండ్‌పై తీసిన హ్యాట్రిక్‌ అతని కెరీర్‌లో హైలైట్‌. కురువిల్లా 10 టెస్టులు, 25 వన్డేలు, అలాగే మొహంతి రెండు టెస్టులు, 45 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించారు.